రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకిత వస్తుందా? రాష్ట్రంలో కొన్ని విషయాల పట్ల ప్రజలు ఎమ్మెల్యేలని నిలదీస్తున్నారా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి తాజాగా జరిగిన ఓ ఘటనే ఉదాహరణగా కనిపిస్తోంది. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ కు ప్రజల దగ్గర నుంచి చేదు అనుభవం ఎదురైంది. మిడ్ మానేరు ముంపు నిర్వాసితులు ఎమ్మెల్యేని నిలదీశారు.  


తాజాగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ ఇచ్చిన పిలుపు మేరకు రవిశంకర్ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనడానికి మిడ్ మానేరు కిందకు వచ్చే బోయినపల్లి మండలంలోని మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. అయితే అక్కడ స్థానిక కాలేజీలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ..అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళే సమయంలో మిడ్ మానేరు నిర్వాసితులు అడ్డుకుంటారని సమాచారంతో వేరే రూటులోకి వెళ్లారు. 


ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న నిర్వాసితులు ఎమ్మెల్యే ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఆయన వాహనం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు వారిని వెళ్ళేగొట్టే ప్రయత్నం చేసిన వారు కదల్లేదు. చివరికి ఎమ్మెల్యే వాహనం నుంచి దిగి నిర్వాసితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయిన వారు ఎమ్మెల్యే మాటని లెక్కచేయకుండా తమకు న్యాయం చేయకుండా ఇంకెన్నాళ్లు పెండింగ్‌లో పెడతారంటూ నిలదీశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 


ముంపు నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని, 5 లక్షల 4 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఎందుకు మంజూరు చేయలేదని అడిగారు. తక్షణమే ఈ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు 18 ఏళ్లు నిండిన పెళ్లీడు యువతులకు 2 లక్షల రూపాయల ప్యాకేజీతో పాటు వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. పెండింగ్ సమస్యలు లేకుండా నిర్వాసితులకు తగిన విధంగా న్యాయం చేయాలని సూచించారు. 


దీంతో సమస్యని పరిష్కరించుకోవడం కోసం అందరూ కూర్చుని మాట్లాడకుందామని ఎమ్మెల్యే చెప్పిన వినలేదు. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కకు జరిపి ఎమ్మెల్యే కారుకు దారి ఇచ్చేలా చేశారు. మొత్తానికి ఎలాంటి ఘర్షణ జరగలేదు గానీ, హామీలు త్వరగా నెరవేర్చకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వారి నుంచి ఇబ్బందులు తప్పేలా లేవు.



మరింత సమాచారం తెలుసుకోండి: