ఈ మధ్య కాలంలో బ్యాంకులు, ఏటీఎంలలో జరుగుతున్న మోసాల గురించి వింటూనే ఉన్నాం. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి సైబర్ నేరస్థులు ఏటీఎంలలో మనకు తెలియకుండానే మన కార్డుల నుండి డబ్బులు చోరీ చేస్తున్న ఘటనలు వింటూనే ఉన్నాం. సైబర్ క్రైమ్ స్టేషన్లకు, బ్యాంకులకు ఈ మోసాల గురించి రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కొందరు ఈ ఘటనల్లో లక్షల రుపాయలు కోల్పోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. 
 
ఏటీఎం మోసాల గురించి ఫిర్యాదులు ఎక్కువగా వస్తూ ఉండటంతో ఢిల్లీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కొన్ని కీలకమైన ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనల ప్రకారం ఇకనుండి కస్టమర్లు రోజుకు ఒకసారి మాత్రమే ఏటీఎం నుండి నగదు తీసుకునే విధంగా నిబంధనలు మార్చబోతున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ సార్లు నగదు తీసుకోవడానికి అనుమతి ఇచ్చినా ఒక లావాదేవీకి మరొక లావాదేవీకి 7 నుండి 12 గంటల సమయం వ్యత్యాసం ఉండేలా కొత్త నిబంధనలు రూపొందిస్తున్నారని సమాచారం. 
 
సెంట్రలైజుడ్ మానిటరింగ్ సిస్టమ్ ఏటీఎంలకు ఏర్పాటు చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. ఈ ప్రతిపాదనలను అమలు చేయటంలో కలిగే సాధ్యాసాధ్యాలను బ్యాంకింగ్ రంగానికి చెందిన అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ కొత్త నిబంధనల అమలు జరిగితే మాత్రం ఒక రోజులో 25 వేల రుపాయలు కేవలం ఒకే ఒకసారి లేదా లావాదేవీ జరిపిన 7 నుండి 12 గంటల సమయం తరువాత మరొక లావాదేవీ జరిపే అవకాశం ఉంది. 
 
కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం ఇలాంటి నిబంధనలు రూపొందించటం వలన అత్యవసర సమయాల్లో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచించినట్లు సమాచారం. బ్యాంకర్స్ మాత్రం ప్రస్తుతం కేవలం ప్రతిపాదనలు మాత్రమే బ్యాంకర్స్ కమిటీ పంపారని చెబుతున్నారు. ఢిల్లీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ప్రతిపాదించింది కాబట్టి ఈ నిర్ణయం అమలు కేవలం ఢిల్లీలో మాత్రమే ఉంటుందా లేక దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారా అనే విషయం గురించి స్పష్టత రావాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: