కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులను ఖర్చు పెట్టకపోతే భవిష్యత్తులో నిధులను కేటాయించము అని ఖరా ఖండిగా కేంద్ర ప్రభుత్వం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించలేదని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. చంద్రబాబునాయడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నరేగా విషయంలో దేశానికే ఒక నమూనాగా తయారు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వందకు పైగా అవార్డులు దక్కాయన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దూసుకెళ్లిందని తెలిపారు. 


పథకాలను పారదర్శకంగా, జవాబుదారీతనంగా అమలు చేసి ఉపాధి హామీ పనుల్లో దేశంలో ఏకైక రాష్ట్రంగా ఏపీని నిలిపితే, వైసీపీ ప్రభుత్వం  తూట్లు పొడవడం జరిగింది.  వైసీపీ ప్రభుత్వం నరేగాను తూట్లు పొడవడం అన్యాయమన్నారు. రాజధాని నిర్మాణ పనులను ఆపేసి కక్షపూరితంగా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. గ్రామాలలోని అంగన్‌వాడీ బిల్డింగులను, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని స్థంభింపజేయడం దురదృష్టకరమన్నారు.  ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఉద్యోగాలను తొలగించి వైసీపీ కార్యకర్తలకు అప్పజెప్పడం కోసం విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. 


అధికారంలోకి వచ్చిన ఈ మూడు నెలల్లో ఏం అభివృద్ధి సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.  అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే నిధులను  నవరత్నాలకు దారి మళ్లించారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కాలువల పనుల బాధ్యతల నుంచి ఈఎన్‌సీ వెంకటేశ్వరరావును తొలగించి జగన్మోహన్‌రెడ్డి ఆప్తుడైనటువంటి సుధాకర్‌బాబుకు ఆ బాధ్యతలు అప్పగించడం  చాలా అన్యాయమని తెలిపారు. 


వెంకటేశ్వరరావుగారు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్యల కాలం నుండి చంద్రబాబునాయుడు కాలం వరకు కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించారని కితాబిచ్చారు. టీడీపీ ప్రభుత్వం పోలవరం పనులు 70 శాతం పూర్తిచేయడానికి,  త్వరితగతిన పనులు జరగడానికి వెంకటేశ్వరరావు సహకరించారని అన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసేవారిని వైసీపీ ప్రభుత్వం పనిచేయనీయదన్నారు.  పోలవరం రీ టెండరింగ్‌ అంటూ ఇష్టమొచ్చినట్లు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రీ టెండరింగ్‌ అంటూ  వైసీపీ ప్రభుత్వ పాలన అంతా రివర్స్‌గా నడుస్తోందని ఎద్దేవ చేశారు. వైసీపీ చర్యలన్నీ  రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని నిమ్మల రామానాయుడు విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: