ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చికాకులు తెప్పించాయా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే వాదనలు వినిపిస్తున్నాయి . వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ,  రాజధాని భూములు ఇచ్చిన రైతాంగం లోనూ ఒక విధమైన ఆందోళన నెలకొంది.  ఈ తరుణంలో అమరావతి ముంపు ప్రాంతమని , రాజధాని నిర్మాణానికి అనువైంది కాదంటూ  మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీశాయి.  మంత్రి వ్యాఖ్యలు వెనుక ముఖ్యమంత్రి ఉన్నారంటూ  విపక్షాలు విమర్శలకు దిగాయి .


 దీంతో ఒక్కసారిగా రాజధాని రైతుల్లో ఆందోళన మొదలైంది.  తమకు  ఇవ్వాల్సిన  వార్షిక కౌలు మొత్తాన్ని కూడా ప్రభుత్వం  ఇవ్వడం  లేదంటూ వారు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనలకు విపక్షాలు జత కలిశాయి . దీనితో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తొలిసారిగా విపక్షాలకు అవకాశం లభించినట్లయింది . రాష్ట్ర రాజధాని రైతులు   విపక్ష నేతలను కలిసి తమ రాజధాని మార్పును వ్యతిరేకించారు .   ఇదే అదనుగా విపక్షాలు సైతం, రాజధాని మార్పు అంశంపై  రాష్ట్ర ప్రభుత్వం పై ఎదురుదాడి కి దిగాయి .  అమరావతి నుంచి రాజధాని మార్పు సరికాదంటూ అధికార వైకాపాపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ , బిజెపి,  జనసేనలు  విమర్శల దాడులు తీవ్రతరం చేశాయి . మంత్రి బొత్స వ్యాఖ్యలతో  రాజధాని మార్పు అంశం ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారింది.  రాజధాని మార్పు పై జరిగిన ప్రచారం తో  ప్రజల్లోనూ ప్రభుత్వం పై ఒక విధమైన వ్యతిరేకత వ్యక్తమైంది.


 వందల కోట్లు వెచ్చించి ఇప్పటికి నిర్మాణాలు చేపట్టిన రాజధానిని మార్చడం ఏమిటని పలువురు ప్రశ్నించారు.  రాజధాని మార్పు సరికాదంటూనే,  అభివృద్ధి వికేంద్రీకరణకు అందరూ  సై అన్నారు . దీంతో రాష్ట్ర ప్రభుత్వం డైలమాలో పడినట్లు కనిపించింది.  బొత్స సత్యనారాయణ వెంటనే తన వ్యాఖ్యలను వక్రీకరించారని  మీడియాపై దుమ్మెత్తిపోశారు.  అటు ఇటు గా చూస్తే  మంత్రి బొత్స వ్యాఖ్యలు బూమరాంగ్ అయినట్లు కనిపిస్తున్నాయి .సాఫీగా సాగిపోతున్న రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో మంత్రి వ్యాఖ్యలు జగన్ సర్కారుకు చాలా ఆయుధం అందించినట్లు గా కనిపించాయి అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: