రాజ‌కీయాలు అంద‌రూ చేస్తారు. అయితే, కొంద‌రు మాత్ర‌మే బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు చేస్తారు! ఇప్పుడు ఈ కోవ‌లోకే వ‌స్తున్నా రు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌ధాని అమ‌రావ‌తిపై చిందులు తొక్కుతున్న విష‌యం తెలిసిందే. నిజానికి అమ‌రావ‌తిని మారుస్తామ‌ని కానీ, ఇక్క‌డ నిర్మాణాలు చేప‌ట్ట‌బోమ‌ని కానీ.. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌లేదు. కేవ‌లం మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ మాత్ర‌మే ఇటీవ‌ల వ‌చ్చిన వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో త‌న అభిప్రాయం వెల్ల‌డించారు. 


పైగా ఇది ప్ర‌భుత్వ నిర్ణ‌యం కాద‌ని కూ డా అన్నారు. ఇక్క‌డ వ‌ర‌ద‌లు, ముంపు ప్రాంతాలు ఎక్కువ‌గా ఉన్నందున నిర్మాణాల‌కు ఖ‌ర్చు ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఇదే స‌మయంలో ఆయ‌న ఈ విష‌యంపై తాము ప‌రిశీల‌న చేస్తున్నామ‌ని అన్నారు. అంతే త‌ప్ప‌.. రాజ‌ధానిని ఇక్క‌డ నుంచి తీసేస్తామ‌ని కూడా చెప్ప‌లేదు. పైగా ఆయ‌న ఎక్క‌డా ఎవ‌రినీ విమ‌ర్శించ‌లేదు. ఉన్న‌ది ఉన్న‌ట్టే వెల్ల‌డించారు. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం శివ‌రామ‌కృష్ణ క‌మిటీ నివేదిక‌ను బుట్ట‌దాఖ‌లు చేసింద‌ని అన్నారు. 


అదే స‌మయంలో కొండ‌వీటి వాగు ప్ర‌స్థావ‌న కూడా తెచ్చారు. దీనిపై విప‌క్షాలు వ‌చ్చిందే అవ‌కాశం అన్న‌ట్టుగా వ్యాఖ్య‌లు సంధిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో రంగంలోకి దిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న ఇమేజ్‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నంలో ప‌డ్డారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓట‌మి పాలైన ఆయ‌న ఇమేజ్ ఘోరంగా డ్యామేజీ అయింది. దీంతో ఇప్పుడు ఆయ‌న ఇమేజ్‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నంలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అమ‌రావ‌తి విష‌యంపై పెద్ద ఎత్తున ఏదో జ‌రిగిపోయింద‌నే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. క‌దిలిస్తే తాట తీస్తా..(అన‌లేదులే) అనేట్టుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. 


నిజానికి ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఓ పార్టీ అధినేత‌గా ఆయ‌న వ్యాఖ్య‌లు చేయొచ్చు. అయితే, తాజాగా ఆయ‌న మంగ‌ళ‌గిరి లోని పార్టీ ఆఫీస్ వ‌ద్ద రాజ‌ధాని ప్రాంత రైతులు , ప్ర‌జ‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌లు బ్లాక్ మెయిల్ రాజ‌కీయా ల‌ను త‌ల‌పిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌ధానిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్య‌లను ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌.. ఇలాంటి వ్యాఖ్య‌లు కేంద్రంలోని న‌రేంద్ర మోడీని, అమిత్ షాను ధిక్క‌రించ‌డ‌మేన‌ని అన్నారు. 


అదే స‌మ‌యంలో బొత్స‌పై వోక్స్ వ్యాగ‌న్ ఒప్పందానికి సంబంధించి జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై కేసులు కూడా ఉన్నాయ‌ని చెప్పారు. వీటిని గుర్తు పెట్టుకుని మాట్లాడాల‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు విన్న మేధావులు, ఆలోచ‌నాప‌రులు ఇంత‌క‌న్నా దౌర్భాగ్యం ఏముంటుంది ప‌వ‌న్ అని నిప్పులు చెరుగుతున్నారు. బొత్స‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా?  లేక రాష్ట్ర అధికారాల‌నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అంటూ వారు ప్ర‌శ్నిస్తున్నారు. రాజ‌ధాని విష‌యం రాష్ట్ర ప‌రిధిలోని దేనని ఇప్ప‌టికే కేంద్రంలోని పెద్ద‌లు స్ప‌ష్టం చేశారు. అయినా.. విమ‌ర్శ‌లు చేయ‌డం అనే విష‌యం కేంద్రంలోనిపెద్ద‌ల‌ను బాధిస్తే.. దానికి కేసుల‌ను బూచిగా చూపి వ్యాఖ్య‌లు చేయ‌డం నీలాంటి వాళ్ల‌కు త‌గిన ప‌నేనా అంటున్నారు. 


నువ్వే అధికారంలో ఉంటే.. కేంద్రానికి అన్నీ చెప్పే చేస్తావా?  లేక కేంద్రం ఏదైనా చేస్తుంద‌ని చేతులు ముడుచుకుని కూర్చుంటావా?  రాష్ట్ర ప్ర‌యోజ‌నాల క‌న్నా.. వ్య‌క్తిగ‌త కేసులే ప్ర‌యోజ‌న‌మ‌ని భావిస్తున్నావా?  రాష్ట్ర రాజ‌ధానిపై మంచి చెడు మాట్లాడుకుంటే.. దానిని కేంద్రంలోని పెద్ద‌ల‌కు ముడివేసి, వోక్స్ వ్యాగ‌న్ కేసుల‌తో లింకు పెట్టి వ్య‌వ‌హ‌రిస్తావా? అంటూ.. నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి నిన్ను ప్ర‌జ‌లు ఎందుకు ఓడించారో.. ఇప్పుడు అర్ధ‌మైంద‌ని దుయ్య‌బ‌డుతున్నారు. ఏదైనా ఉంటే.. రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల కోసం.. కేంద్రంతో పోరాడాలే త‌ప్ప‌.. కేంద్రాన్ని బూచిగా చూపించి.. పాల‌కుల‌ను బెదిరించ‌డం, బ్లాక్‌మెయిల్ చేసే రాజ‌కీయాలు చేయ‌డం కొత్త‌గా ఉంద‌ని నిప్పులు చెరుగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: