జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్ళీ పోలిటికల్ కామెడీలు చేస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. ఏదైనా సమస్యపై ఆవేశంగా మాట్లాడే పవన్...దానిపైన పూర్తిగా నిలబడకుండా మధ్యలోనే వదిలేస్తారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇలా ఏదైనా ఒక విషయాన్ని టేకప్ చేసి మధ్యలో వదిలేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే పవన్ ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఒకానొక సమయంలో ఎంత ఆవేశం గా స్పీచ్ లు ఇచ్చారో చూశాం కూడా. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని ఈ విషయంపై తెగ ప్రశ్నించారు.


అలాగే కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేస్తూ...టీడీపీకి దమ్ముంటే ఎన్డీయే నుంచి బయటకొచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టాలని జబ్బలు చరిచారు. అవిశ్వాసం పెడితే తనకు సెంట్రల్ లో మంచి ఫాలోయింగ్ ఉందని ఒక 50 ఎంపీ మద్ధతు వరకు కూడబెడతానని చెప్పారు. ఇక టీడీపీ అదే పని చేసింది కానీ పవన్ అప్పుడు అడ్రెస్ లేరు. ఇక ఎన్నికల ముందు గానీ, ఇప్పుడు గానీ ప్రత్యేకహోదా ఊసే తీయట్లేదు.


అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం రాజధాని కోసం తమ భూములు లాక్కుంటుందని కొందరు రైతులు పవన్ వద్ద బోరుమన్నారు. దీంతో నేను మీకోసం ఉన్నా, పోరాడతానని చెప్పి సైడ్ అయిపోయారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిన పవన్ వాటికి కట్టుబడి ఉండకుండా...ఎన్నికల ముందు వైసీపీపై తన ప్రతాపాన్ని చూపారు. ఇలా చాలా విషయాల్లో పవన్ మధ్యలోనే చేతులెత్తేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై పవన్ మండిపడుతున్నారు. 


జగన్ సర్కార్ రాజధానిని మారుస్తుందని వార్తల వస్తున్న నేపథ్యంలో పవన్ అమరావతి పర్యటనకు వెళ్ళి రైతులతో మాట్లాడుతున్నారు. రాజధానిని మారిస్తే బాగోదని, అవసరమైతే మోడీ, అమిత్ షాతలని కూడా కలిసి మాట్లాడతానని చెబుతున్నారు. జగన్ రాజుల వ్యవహరిస్తున్నారని, రాజులు రాజ్యాన్ని మార్చినట్లు రాజధాని మారిస్తే ఊరుకొనని వార్నింగులు ఇస్తున్నారు. రైతులకు అండగా ఉంటానని, వారి కోసం పోరాడతానని పాత డైలాగులు రిపీట్ చేస్తున్నారు. మరి ఈసారైనా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళతారా లేక మధ్యలోనే వదిలేసి పోలిటికల్ కామెడీ చేయడంలో నన్ను మించిన వాళ్ళు లేరని నిరూపిస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: