చేతిలో సెల్లులేని వ్యక్తి ఇప్పుడు కనిపించడు.  సెల్లె జీవితం అయిపొయింది.  సెల్ ఫోన్ లేదంటే ఆ వ్యక్తిని ప్రపంచ వింత వ్యక్తిగా చూసే రోజులు వచ్చాయి.  ఇప్పుడు సెల్ ఫోన్ వాడకం తప్పనిసరి అయ్యింది.  కానీ, ఇప్పటి వ్యక్తి సెల్ కు బానిసలా మారిపోయాడు.  సెల్ ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుతున్నాడు.  అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అన్నది చూసుకోవాలి కదా.  కానీ, మనిషి మాత్రం వాటి గురించి పట్టించుకోవడం లేదు. 


మొబైల్ లేని రోజులలో పట్టణాలలోనైనా.. పల్లెలలోనైనా సరే రాత్రి పది కాగానే పడకేసేవారు.  కానీ, మొబైల్స్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మారిపోయింది.  ప్రజల లైఫ్ స్టైల్ మారిపోయింది.  పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా అన్ని చోట్లా మొబైల్స్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి.  మొబైల్స్ అందుబాటులోకి రావడంతో.. నిద్రకు దూరమవుతూ వస్తున్నారు.  ఇక స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక ఇది మరింతగా మారిపోయింది.  ఇప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా మొబైల్ ఫోన్స్ తోనే కాలక్షేపం చేస్తున్నారు.  


పగలు కాకుండా, రాత్రిపూట కూడా మొబైల్ ఫోన్స్ తో కాలక్షేపం చేస్తే కంటికే కాకుండా.. ఒంటికి కూడా మంచిది కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  రాత్రిసమయంలో రెండు గంటలకంటే ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడటం వలన ఇబ్బందులు వస్తాయట. మొబైల్ లైట్ వలన కళ్ళు దెబ్బతింటాయి.  గంటల కొద్దీ మొబైల్ ఫోన్స్ ను ఉపయోగిస్తే ఎలాంటి అనర్ధాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. 


మొబైల్ ఫోన్ తో ఎక్కువగా కాలక్షేపం చేయడం వలన నిద్రలేమితో బాధపడవలసి వస్తుంది.  తద్వారా శరీరం బలహీనపడుతుంది.  రాత్రి నిద్రలేకపోతే.. మెదడు చురుగ్గా పనిచేయదు.  నిద్రలేమితో బాధపడటం వలన కొత్త విషయాలను తొందరగా గ్రహించలేరు.  దీంతో అందరికంటే వెనకబడిపోవలసి వస్తుంది. 


ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే.. శారీరక రుగ్మతలతో పాటుగా మానసిక సమస్యలతో కూడా బాధపడవలసి వస్తుంది.  ఇక నిద్రలేమితో బాధపడేవారిలో మెలటోనిన్ సమస్య కనిపిస్తుంది.  మెలటోనిన్ సమస్య వలన ఒత్తిడి ఏర్పడుతుంది.  సరైన నిద్రలేకపోవడం వలన సమయానికి తిండి తినలేం.  తినే తిండి కూడా ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తారు.  ఫలితంగా ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  

కాబట్టి రాత్రి సమయంలో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ తో కాలక్షేపం చేయకుండా వీలైనంత త్వరగా మొబైల్ ను పక్కన పెట్టి పడుకుంటే మంచిది.  రోజుకు కనీసం మనిషి 7 నుంచి 8 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు.  సెల్ ఉండటం మంచిదే.. అవి మనకు ఉపయోగపడేవిగా ఉండాలిగాని, మన వినాశనాన్ని కోరుకునేవిగా ఉండకూడదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: