ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన వైసీపీ.. త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ క్లీన్‌స్వీప్ చేయాల‌ని చూస్తోంది. ఇందుకు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళ్తోంది. ప్ర‌ధానంగా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టి.. టీడీపీ నామ‌రూపాలు లేకుండా చేయాల‌ని చూస్తోంది. అయితే.. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే... ప్ర‌జాప్ర‌తినిధుల‌ను గాకుండా.. చేతిలో ఎలాంటి ప‌ద‌విలేని నేత‌ల‌నే పార్టీలోకి తీసుకోవాల‌నే వ్యూహంతో వైసీపీ నేత‌లు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయిన టీడీపీని మ‌రింత దెబ్బ‌తీయ‌డానికి వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. 


ఇందులో భాగంగానే టీడీపీ నేత‌లే టార్గేట్‌గా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని వైసీపీ అందుకున్నా.. ఇంకా అక్క‌డ‌క్క‌డ కొంత బ‌ల‌హీనంగానే ఉంద‌ని చెప్పొచ్చు. అలాంటి ప్రాంతాల్లో టీడీపీ నేత‌ల‌ను లాగే ప‌నిలో ప‌డింది. ఈ క్ర‌మంలోనే విశాఖ జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నేత అడారి తులసీరావు కుమారుడు ఆనంద్, కుమార్తె రమాకుమారి వైసీపీ అధినేత‌, ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 


అడారి ఆనంద్ అనకాపల్లి నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. ఇక రమాకుమారి యలమంచిలి మున్సిపల్ వైస్ చైర్మన్ గా పని చేశారు. తులసీరావు.. దశాబ్దాలుగా టీడీపీలోనే ఉన్నారు. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తాను టీడీపీలోనే ఉంటానని తుల‌సీరావు ప్రకటించారు. అయితే.. ఇక్క‌డ మ‌రొక విష‌యం చెప్పుకోవాలి. టీడీపీ నేత‌ల‌ను వైసీపీ వ్యూహ‌త్మ‌కంగా చుట్టుముడుతోంది. కొంత‌మందిని ప్ర‌త్యేకంగా టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తోంది. వైసీపీ దెబ్బ‌తో ఇప్ప‌టికే ప‌లువురు టీడీపీ నేత‌లు అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. మ‌రికొంద‌రు.. చ‌క్క‌గా వైసీపీలోకి వ‌చ్చేస్తున్నారు. 


ఇంకొంద‌రు అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల‌న‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన వరుపుల రాజా విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసిమ‌రీ జగన్‌పై పొగిడారు. అంతేగాకుండా టీడీపీకి రాజీనామా చేసి.. తీవ్ర‌స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇలా టీడీపీని వైసీపీ అన్నివైపుల నుంచి చుట్టుముడుతూ.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తోంది. వైసీపీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన‌ట్టు ముందుముందు చేరిక‌లు ఊపందుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. చూడాలి మ‌రి ఎవ‌రెవ‌రు వ‌స్తారో..!  



మరింత సమాచారం తెలుసుకోండి: