తిరుమల మొదటి కనుమ రోడ్డులో గల శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో సోమ‌వారం చవితి పూజ ఘనంగా జరిగింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చలువపందిళ్లు వేసి ఆలయాన్ని అందంగా అలంకరించారు. అర్చకులు శాస్త్రోక్తంగా గణపతికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి తిరుమల ప్ర‌త్యేకాధికారి ఎ.వి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ ఇక్కడి స్వామివారి ఆశీస్సులతో భక్తులు సురక్షితంగా కనుమ రోడ్డులో ప్రయాణిస్తున్నారని చెప్పారు. రెండు ఘాట్ రోడ్ల‌ల‌లో శ్రీ‌వారి భ‌క్తులు సుర‌క్షిత ప్ర‌యాణానికి ప్ర‌తి సంవ‌త్స‌రం టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో వినాయక స్వామివారికి పూజ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.వినాయకుడు అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగించి మంచి జరిగేలా చూడాలని ఆకాంక్షించారు.





ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత కార్యక్రమం నిర్వహించారు. అనంత‌రం తిరుమల ప్ర‌త్యేకాధికారి  కళాకారులను స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ రామ‌చంద్ర‌రెడ్డి, శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాధ్‌, రవాణా విభాగం జనరల్‌ మేనేజర్‌  శేషారెడ్డి, సిఎమ్‌వో డా. నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో  కూడా వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, అర్చన చేపట్టారు. సాయంత్రం శ్రీవినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమించారు.




 అదేవిధంగా, రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీవినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.వినాయక చవితిని పురస్కరించుకుని టీటీడీ పాలకమండలి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహాగణపతి స్వామివారు అందరికీ సంపూర్ణ ఆయురారోగ్య భాగ్యములను కలుగజేయాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నానంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్విట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: