ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల్లో భాగంగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు పేరిట సరికొత్త డిపార్టుమెంటుని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశమవుతుంది. ఈ సమావేశంలో ఆర్టీసీ విలీనంతో పాటుగా  ఈ బుధవారం  నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇసుక విధానంపైన కూడా క్యాబినెట్ లో చర్చించనున్నారు. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై మంత్రి మండలి చర్చించనున్నట్టు సమాచారం. దీనితో పాటుగా పోలవరం సహా పలు ప్రాజెక్టుల కు రివర్స్ టెండెరింగ్ పైన కూడా సీఎం జగన్ అధ్యక్షతన జరిగే మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా  ఏపీఎస్ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడంపై  మంత్రి మండలి ఆమోదముద్ర వేయనున్నది. 




పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్నివెంట్రామయ్య( నాని) తెలిపారు.  మిగిలిన విధి విధానాలన్నీ త్వరలో ఖరారవుతాయని చెప్పారు. దశాబ్దాలుగా ఉద్యోగ భద్రత లేకుండా ఆర్టీసీలో కార్మికులు పనిచేస్తున్నారని మంత్రు అన్నారు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. 




ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన సీఎం వైయస్‌ జగన్‌ కమిటీని నియమించారని చెప్పారు. ఆ కమిటీ చైర్మన్‌ ఆంజనేయరెడ్డి సీఎం వైయస్‌ జగన్‌కు నివేదిక అందజేసిందన్నారు. నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యమంత్రి ఆమోదించారని మంత్రి నాని స్పష్టం చేశారు. ప్రభుత్వం దానిపై మంత్రి మండలితో చర్చించి తగిన  నిర్ణయం  తీసుకోనున్నట్టు  వివరించారు.  సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల కల నెరవేరబోతుందని మంత్రి నాని చెప్పారు. ప్రతి సంవత్సరం ఆర్టీసీ మీద ఉన్న జీతభత్యాల భారం సుమారు రూ. 3,300 నుంచి రూ. 3,500 కోట్లు ఉందని, దాన్ని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకోబోతుందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్నారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: