తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ వారం రోజుల క్రితం చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయ‌న్న‌ది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ జెండాకు తామే ఓనర్ల‌మ‌ని ఈటల నోటి నుంచి వచ్చిన మాటలపై అధికార టీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున‌ చర్చలు నడిచాయి. చాలామంది ఈ వ్యాఖ్యలపై స్పందించకపోయినా కేసీఆర్ సామాజిక‌వ‌ర్గానికే చెందిన మరో మంత్రి ఎర్రబెల్లి మాత్రం అనూహ్యంగా రియాక్ట్‌ అయ్యారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశాక‌ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మాత్రమే గులాబీ జెండాకు బాస్ అని చేసిన వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.


ఈట‌ల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత... పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కేసీఆర్ వెంట ఉన్నారు. అలాంటి సీనియర్ నేత మీద మాట్లాడేందుకు ఎవ్వ‌రూ గులాబీ పార్టీలో సాహసం చేయకపోయినా మంత్రి హోదాలో ఉన్న ఎర్రబెల్లి కౌంటర్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యల వెనక కేటీఆర్ ఉన్న‌ట్టు గుసగుసలు వినిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా కేటీఆర్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఈట‌ల‌కు కౌంట‌ర్‌గానే క‌నిపిస్తున్నాయి. 


పదవులు రాగానే కొంతమంది నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. పదవులు వచ్చింది పార్టీ వల్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించిన ఆయన.. ప్రజలే బాసులనే విషయాన్ని నేతలు గుర్తు పెట్టుకోవాలన్న మాట చూస్తుంటే.. ఈటలతో వార్ ను ఓపెన్ గా డిక్లేర్ చేసినట్లే అన్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక ఎర్ర‌బెల్లి కూడా కేటీఆర్‌ను కలిశాకే ఈటెల‌ను టార్గెట్ చేసేలా మాట్లాడ‌డం... ఇప్పుడు కేటీఆర్ సైతం డైరెక్టుగానే ఎటాక్ చేయ‌డంతో ఈటల విషయాన్ని తేల్చేందుకు వీలుగానే కేటీఆర్ తాజా వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు.


ఈట‌ల విష‌యంలో గులాబీ ద‌ళం పెద్ద బాస్‌, చిన్న బాస్ ఓ క్లారిటీకి వ‌చ్చేశార‌న్న గుస‌గుస‌లు కూడా ఆ పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఇక ద‌స‌రాకు జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కేసీఆర్ షాకులు ఉంటాయ‌న్న సంకేతాలు వ‌దిలేస్తున్నారు. ఈ షాకులు ఎవ‌రికో ?  ఈ మార్పుల్లో ఈటల‌ను ఏం చేస్తారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: