ఊహించని విధంగా 151 సీట్లు గెలుచుకుని జగన్ అధికార పీఠం అధిరోహించి 100 రోజులు కావొస్తుంది. ఈ 100 రోజుల పాలనలో జగన్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా అవినీతికి తావు ఇవ్వకుండా పరిపాలన చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా మొత్తం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని జగన్ పాలన సాగించారు. అయితే పాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి జగన్ మంత్రులు పనితీరుపై నిఘా పెట్టారు. ఇక 100 రోజులు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో జగన్ మంత్రుల పనితీరుపై ఓ రిపోర్ట్ తెప్పించుకున్నారు.


ఈ రిపోర్ట్ ఆధారంగా త్వరలోనే మంత్రులతో జగన్ ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ రిపోర్ట్ లో ఈ మంత్రి పని తీరు ఎలా ఉంది. వారి శాఖల్లో పనులు ఎంతవరకు జరుగుతున్నాయి. ఎవరు మీడియా ముందు దూకుడు ప్రదర్శిస్తున్నారు లాంటి తదితర అంశాలపై జగన్ రిపోర్ట్ తయారు చేయించారని తెలుస్తోంది. అయితే వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రిపోర్ట్ లో చాలా మంది మంత్రులకు మంచి మార్కులే పడ్డాయట. 


జగన్ మొదట్లో ఇచ్చిన సూచనలని అందరూ బాగానే ఫాలో అయ్యారట. ముఖ్యంగా అధికారుల పనుల్లో ఎక్కువ జోక్యం చేసుకోలేదట. అలాగే మంత్రులపై అవినీతి ఆరోపణలు కూడా రాలేదట. పైగా రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని ముందే జగన్ చెప్పడంతో మంత్రులంతా అలెర్ట్ గా ఉన్నారట. అయితే పాలన విషయాల్లో మంచి మార్కులు దక్కించుకున్న మంత్రులు ప్రతిపక్షాల విమర్శలని సమర్దవంతంగా ఎదురుకోలేదట. ముఖ్యంగా జగన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు వరద నివారణ చర్యలు సరిగా చేపట్టినా.. ప్రతిపక్షాల విమర్శలకు సరిగా బదులు చెప్పలేకపోయారనే నెగటివ్ మార్క్ ఉందట. 


అటు జిల్లా ఇంచార్జి మంత్రులుగా ఉన్న కొంతమందికి స్థానిక మంత్రులతో పొసగడంలేదట. వీటి మీద జగన్ త్వరలోనే మంత్రులకు క్లాస్ తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే పాలన విషయంలో మంత్రులకు మంచి మార్కులు పడ్డాయి. కానీ, ప్రతిపక్ష విమర్శలని తిప్పికొట్టడంలో ఫెయిల్ అయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: