ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి వెంటనే అమలు చేసే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. తాను అనుకున్నది చేయడంలో జగన్ ఎవరి మాటని లెక్క చేయరు, ఎవరి సిఫార్సులని పట్టించుకోరు. సీఎం అయిన తర్వాత కూడా జగన్ ఇదే తరహాలో నడుస్తున్నారు. మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి అనేక కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో తాను అనుకున్నదే చేశారు. ఇంతలా ఏదైనా నిర్ణయాన్ని సూటిగా తీసుకునే జగన్ కు టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంలో అనేక ఒత్తిళ్ళు ఎదురవుతున్నాయి.


అయితే ఆ ఒత్తిళ్లకు జగన్ కూడా తలొగ్గుతున్నట్లు తెలుస్తోంది. అందుకనే తాజాగా ఛైర్మన్ తో సహ టీటీడీలో 15 మంది పాలక మండలి సభ్యులని 25 మందికి పెంచారు. 25 మంది సభ్యుల పాలకమండలికి నిన్న ఏపీ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. తమకు కూడా అవకాశం కల్పించాలని కొందరు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు, పారిశ్రామిక వేత్తలు, సీనియర్ నేతలు ఒత్తిడి చేయడం వల్లే జగన్ 25 మందికి పెంచారని తెలుస్తోంది.


సంఖ్య పెంచడంలోనే కాదు సభ్యుల నియామకంలో కూడా జగన్ పై ఒత్తిళ్ళు వస్తున్నాయి. దేవుడుకు సేవ చేయాలనో లేక, ప్రతిష్టాత్మక టీటీడీ బోర్డులో సభ్యునిగా ఉండాలనే ఆరాటమో కానీ మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలు తమకు అవకాశం కల్పించాలని జగన్ని ప్రెషర్ చేస్తున్నారంటా. వీళ్లతో పాటు  పారిశ్రామిక వేత్తల నుంచి కూడా.. పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిళ్లు వస్తున్నాయి. ఎవరి సిఫార్సు లేకుండా స్వయంగా వారే రంగంలోకి దిగి  టీటీడీ బోర్డులో తమకు చోటివ్వాలని జగన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.


తెలంగాణ నుంచి మైహోమ్ రామేశ్వరరావు, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్, నిర్మాత దిల్ రాజు లాంటి వాళ్లు కూడా.. ఈ జాబితాలో ఉన్నారని సమాచారం. మొత్తానికి అయితే ఏ విషయంలో వెనకడుగు వేయని జగన్ ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలి జగన్ ఎవరి ఒత్తిడికి తలొగ్గి టీటీడీ పదవి అప్పగిస్తారో. 


మరింత సమాచారం తెలుసుకోండి: