చంద్రబాబు అధికారం కోల్పోయి మూడు నెలలు పైనే కావొస్తోంది. ఈ మూడు నెలల కాలంలో చంద్రబాబుకు చాలామంది నేతలు షాక్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడూ ఏమి మాట్లాడని నేతలు సైతం అధికారం కోల్పోయిన వెంటనే చంద్రబాబుని పూచిక పుల్లలా తీసిపారేసినట్లు మాట్లాడుతూ...పార్టీని వీడుతున్నారు. ఒకవైపు నేతలు పార్టీని వీడిన చంద్రబాబు మాత్రం అధికారం వైసీపీతో పోరాడుతూ...పార్టీని బలోపేతం చేసే దిశగా సాగుతున్నారు. అయినా సరే ఇంకా కొందరు నేతలు చంద్రబాబుని లెక్క చేయకుండా ఉంటున్నారు.


తాజాగా తూర్పు గోదావరి జిల్లా నేతలే దీనికి ఉదాహరణగా నిలిచారు. గురువారం చంద్రబాబు తూరుగోదావరి జిల్లా టీడీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లాలో చాలామంది నేతలు హాజరయ్యారు. కానీ కొందరు ముఖ్య నేతలు మాత్రం డుమ్మా కొట్టారు. ముఖ్యంగా జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈ సమావేశానికి హాజ‌రుకాలేదు. ఆయనతో పాటు కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసిన చలమలశెట్టి సునీల్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, టీడీపీలో కీలక నేతగా పేరొందిన బొడ్డు భాస్కర రామారావు, కాకినాడ నగర నేత దొరబాబులు సైతం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.


అయితే ఈ సమావేశం కంటే ముందే జిల్లాలోని నేతలకు సమావేశానికి హాజరు కావాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే ఆ ఆదేశాలని బేఖాతరు చేస్తూ వారు హాజరుకాలేదు. దీంతో అధినేత కొంత కలత చెందినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయింద దగ్గర నుంచి త్రిమూర్తులు పార్టీ అధిష్టానంపై అసంతృప్తితోనే ఉన్నారు. పైగా పార్టీతో సంబంధం లేకుండా కీలక కాపు నేతలతో సమావేశం కూడా పెట్టారు. అప్పటి నుంచి త్రిమూర్తులు పార్టీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు.


త్రిమూర్తులు పార్టీని వీడతారు కాబట్టే ఇలా చేస్తున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈయన వైసీపీలోకి గానీ, బీజేపీలోకి గానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కమలం పార్టీ వైపు చూస్తున్నారని, అందుకే మీటింగ్‌కు రాలేదని కార్యకర్తలు చ‌ర్చించ‌కుంటున్నారు. ఇక రూప, చలమలశెట్టి సునీల్ లు ఎందుకు రాలేదో సరైన కారణం తెలియరాలేదు. మొత్తానికి చంద్రబాబు పార్టీ కష్టపడుతుంటే...నేతలు మాత్రం ఆయన్ని పూచిక పుల్లలా తీసిపారేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: