దేశవ్యాప్తంగా కొత్తగా అమల్లోకి వచ్చిన కొత్త వాహన చట్టం వాహనదారుల్లో దడ పుట్టిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసివస్తోంది. ఈ జరిమానా సెగ ఒడిశాలో ఓ ట్రక్కు డ్రైవర్ కు తగిలింది. ఏకంగా రూ.86,500 జరిమానాతో చుక్కలు చూపించారు ఒడిశా రాష్ట్ర అధికారులు. దేశంలో అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అదుపులోకి తెచ్చేందుకు ఈ కొత్త వాహన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. 

 

 

 

సెప్టెంబర్ 3వ తేదీన ఒడిశా రాష్ట్రం సంబల్ పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన  బీఎల్ఏ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన జేసీబీని ఓ ట్రక్కులో తరలిస్తూండగా తనిఖీల్లో భాగంగా పోలీసులు పట్టుకున్నారు. సదరు డ్రైవర్ అధికారిక డ్రైవర్ కాకపోవడంతో రూ.5వేలు, లైసెన్స్ లేని డ్రైవింగ్ కు రూ.5వేలు, అదనపు బరువు 18 టన్నులు ఎక్కువ ఉన్నందుకు భారీ మొత్తంలో రూ.56వేలు, పరిమితికి మించిన లోడుతో వెళ్తున్నందుకు రూ.20వేలు, పలు తప్పిదాలకు రూ.500 కలిపి మొత్తంగా రూ.86,500 జరిమానాను ట్రక్కు డ్రైవర్ అశోక్ జాదవ్ కు విధించారు. అయిదు గంటలపాటు బతిమాలుకుని రూ.70వేలు చెల్లించాడు. ఇంతటి భారీ మొత్తంలో ఫైన్ ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు.

 

 

 

సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాన్ని ఒడిశా ప్రభుత్వం అదే రోజు నుంచీ అమల్లోకి తెచ్చింది. రాష్ట్రం మొత్తం మీద తొలి నాలుగు రోజుల్లోనే దాదాపుగా రూ.88లక్షలు జరిమానా కింద వసూలు చేసింది. దీంతో.. అధిక మొత్తంలో జరిమానాలు విధించిన రాష్ట్రంగా దేశంలో తొలి స్థానంలో నిలిచింది ఒడిశా. ఈ కొత్త వాహన చట్టం గురించి వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: