ప్రస్తుతం కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు లక్షల్లో ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల ట్యూషన్ కోసం నెలకు 1,000 రుపాయల నుండి 5,000 రుపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. విద్య చాలా ఖరీదైన ఇలాంటి సమయంలో తిరుచ్చిలోని అరిమంగళంకు చెందిన గోమతి మాత్రం కేవలం ఒక్క రుపాయి ఫీజు తీసుకుంటూ పేద విద్యార్థులకు పాఠాలను బోధిస్తూ ఉండటం విశేషం. 
 
గోమతి వృత్తిరిత్యా ఈవీఆర్ కళాశాలలో పరీక్షల నియంత్రణ విభాగంలో పనిచేస్తున్నారు. కళాశాలలో విధులు ముగిసిన తరువాత ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్యూషన్ సెంటర్లో గోమతి ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న 60 మంది విద్యార్థులకు ప్రస్తుతం గోమతి శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల నుండి కేవలం ఒక్క రుపాయి మాత్రమే ఫీజుగా తీసుకుంటున్నారు. 
 
గోమతి వయస్సు ప్రస్తుతం 47 సంవత్సరాలు. ఈమె ఇప్పటివరకూ వివాహం కూడా చేసుకోలేదు. గోమతి విద్యార్థుల కోసం చేస్తున్న సేవను విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. 2003 సంవత్సరం నుండి తిరుచ్చిలో డీ ఎం ఎస్ ఎస్ అనే స్వచ్చంద సంస్థ ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తోందని ఉపాధ్యాయురాలిగా పనిచేయాలనే ఆసక్తితో ట్యూషన్ సెంటర్లో చేరానని, 16 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నానని గోమతి చెప్పారు. 
 
పేద విద్యార్థుల యొక్క కష్టాలు నాకు తెలుసని బాల్యంలో వీధి దీపాల కింద చదువుకున్నానని గోమతి చెప్పారు. ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తోన్న ట్రస్ట్ కు సొంత భవనం కూడా లేదని అందువలనే విధ్యుత్ స్తంభం దగ్గర తరగతులు నిర్వహిస్తున్నానని తెలిపారు. విద్యార్థులను రెండు బ్యాచులుగా విభజించి తరగతులు నిర్వహిసున్నట్లు తెలిపారు. సేవా భావం కలిగిన వారు, ప్రభుత్వం ఎవరైనా చిన్న భవనం ఏర్పాటు కొరకు సహకారం అందిస్తే సేవలను మరింతగా విసృతపరచటానికి అవకాశం ఉన్నట్లు గోమతి తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: