తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు రూ.1,46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సోమవారం ఉదయం 11 . 30 గంటలకు ప్రారంభమైన  అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ తన బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మరుక్షణమే వాయిదా పడ్డాయి.  కాగా ఈ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. సమైక్య పాలన చివరి పదేళ్లలో రూ.54,052కోట్లుగా ఉంది. గడిచిన ఐదేళ్లలో మూలధనవయ్యం లక్ష 65,165కోట్లుగా ఉందని'' సీఎం పేర్కొన్నారు.  సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు దక్కిన మూలధన వ్యయం వాటా తక్కువ ఉండేది. కొత్త రాష్ట్రం తెలంగాణ ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతిసాధించింది. గడిచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వినూత్న పథకాలన ప్రభుత్వం అమలు చేస్తోంది. అతి తక్కువ వ్యవధిలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా సగర్వంగా నిలిచింది. రాష్ట్ర వృద్ధి రేటు 10.5గా నమోదైంది.



ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపయ్యింది. ఈ క్రమంలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ.1,11,055కోట్లు, మూలధన వ్యయం రూ.17,274.67కోట్లు, బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.08కోట్లు, రాష్ట్ర ఆర్థిక లోటు రూ.24,081.74కోట్లుగా పేర్కొన్నారు. తెలంగాణకు జీఎస్టీ పరిహారం తీసుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. జులై నెలలో తీసుకున్న జీఎస్టీ పరిహారం ఏప్రిల్, మే నెల కంటే 4 రెట్లు ఎక్కువని, గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ అంచనాలకు నేటికి చాలా వ్యత్యాసముందని చెప్పారు. కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 1.36 శాతం మాత్రమే వృద్ధి సాధ్యమైందన్నారు.వ్యవసాయ రంగంలో 2018-19 నాటికి 8.1 శాతం వృద్ధిరేటు నమోదు చేశామన్నారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం ఇప్పటి వరకు రూ. 20,925 కోట్లు కేటాయించామని చెప్పారు. రైతుబంధు పథకానికి రూ. 12 వేల కోట్లు కేటాయించామన్నారు. రైతుబీమా ప్రీమియం చెల్లింపుకు రూ. 1,137 కోట్లు, ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు కేటాయించగా, అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో రూ. 5,37,373 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందినవి కేవలం రూ. 31,802 కోట్లు మాత్రమేనాని చెప్పారు. 



దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది. ఐదేళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. వినూత్నమైన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దృఢంగా మారిందని చెప్పారు. 2013-14లో జీఎస్‌డీపీ విలువ రూ. 4,51,581 కోట్లు అని వివరించారు. పోలీసు కమిషనరేట్ల సంఖ్యను 9కి పెంచామన్నారు. పోలీసు సబ్ డివిజన్ల సంఖ్యను 163కి, పోలీసు సర్కిళ్ల సంఖ్యను 717కి, పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కి పెంచినట్టు చెప్పారు. గ్రామపంచాయతీలకు రూ. 2,714 కోట్లు, పురపాలక సంఘాలకు రూ. 1,764 కోట్లు, ఆరోగ్య శ్రీకి ఏడాదికి రూ. 1,336 కోట్లు చొప్పున కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం వల్ల ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభా వాన్నివ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతుందని అంచనా అన్నారు. అన్ని శాఖల్లో ఉన్న బకాయిలు తక్షణమే చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బకాయిల చెల్లింపునకు బడ్జెట్ లో తగిన కేటాయింపులు చేశామన్నారు. బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయమన్నారు. పరిమితులకు లోబడి ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం నిధులను ఖర్చు చేశామన్నారు. నిధుల ఖర్చుపై మంత్రులు, కార్యదర్శులకు ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన సూచనలు చేశామన్నారు. 


.

ఐదేళ్లలో రాష్ర్ట స్థూల జాతీయోత్పత్తి రెట్టింపు అయింది. వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చు చేశాం. నిధులు ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. ఐదేళ్లలో పెట్టుబడి వ్యయం ఆరు రెట్లు పెరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గింది. వాహనాల అమ్మకాలు 10.65 శాతం తగ్గాయి. రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తెలంగాణపై కూడా పడిందన్నారు. ఐటీ రంగంలో 2018-19 నాటికి 11.05 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. 2018-19 నాటికి లక్షా 10 వేల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించామన్నారు. వందలాది గురుకులాల్లో లక్షలాది మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందుతోందన్నారు. భీకరమైన జీవన విధ్వంసం నుంచి తెలంగాణ కుదుట పడిందని చెప్పారు. తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతోందన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: