రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్రాంతంలో బీమా సొమ్ము కోసం ఒక వ్యక్తి తన హత్యకు తానే ప్లాన్ చేసుకొని చనిపోయాడు. తన పేరుపై ఉన్న 50 లక్షల రుపాయల ప్రమాద బీమా తన కుటుంబానికి వస్తే తన కుటుంబం సంతోషంగా బ్రతుకుతుందని ఈ పని చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం రాజస్థాన్ లోని బిల్వారా ప్రాంతానికి చెందిన బల్వీర్ వివిధ అవసరాల కోసం 20 లక్షల రుపాయలు తనకు తెలిసిన వారి నుండి అప్పు చేశాడు. 
 
కానీ ఎంత ప్రయత్నించినా ఆ అప్పును తీర్చలేకపోయాడు. అప్పు తీర్చే మార్గం కనపడకపోవటంతో బల్వీర్ తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యాడు. గడచిన ఆరు నెలల నుండి బల్వీర్ కు ఎటువంటి ఆదాయం రాలేదు. ఆదాయం లేకపోవటం, అప్పులు పెరిగిపోవటంతో బల్వీర్ ఒక ప్ర్రైవేట్ బ్యాంకులో ఇన్సూరెన్స్ చేయించుకొని ప్రీమియం కింద 8,43,200 రుపాయలు చెల్లించాడు. 
 
ఈ ప్రమాద బీమా ద్వారా చనిపోయినా తన కుటుంబం కష్టాల పాలు కాదని భావించాడు.ప్రీమియం చెల్లించిన తరువాత తనను తానే హత్య చేయించుకోవటం కొరకు ఉత్తరప్రదేశ్ కు చెందిన సునీల్ యాదవ్ మరియు రజ్వీర్ సింగ్ లను సంప్రదించాడు. తనను హత్య చేస్తే 80 వేల రుపాయలు చెల్లిస్తానని చెప్పాడు. వారు ఒప్పుకోవటంతో 10,000 రుపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. 
 
మిగతా డబ్బును హత్య చేసిన తరువాత తన జేబులో నుండి తీసుకోమని చెప్పాడు. సునీల్ రజ్వీర్ ఇద్దరూ కలిసి బల్వీర్ ను గొంతు నులిమి హత్య చేశారు. పోలీసులు బల్వీర్ కాల్ డేటా మరియు సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నారు. బీమా సొమ్ము కోసం తనను తానే హత్య చేయించుకున్నాడన్న విషయం తెలిసి షాక్ అవ్వటం పోలీసుల వంతయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: