స్పష్టమైన వైఖరితో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ముందుకు రావాలనివైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య హితవు పలికారు. అంతేకానీ  గోడమీద పిల్లిలాగా వ్యవహరించొద్దని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికైనా  స్క్రిప్టు రీడింగ్‌ ను మానుకోవాలని హితవు చెప్పారు. చంద్రబాబుకు  పవన్‌ రహస్య స్నేహితుడని, అందుకే ఆయన రాసిచ్చిన స్క్రిప్టునే పవన్‌ చదువుతున్నాడని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతలు గురించి పవన్‌ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు పల్నాడు అంశం తీసుకొని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే తప్పని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రోశయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.



రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారన్నారు. ఒకపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న పవన్‌కు కాపులను బీసీల్లో కలిపే అంశంపై అవగాహన లేకపోవడం విచిత్రంగా ఉందని కాపు కార్పొరేషన్‌ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం కోసం ఈబీసీ కోటాలో ఐదుశాతం రిజర్వేషన్ ను తీసుకుంటే ..రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్ధేశ్యంతో సీఎం వైయస్‌ జగన్‌ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు రాజా వివరించారు. ఆయన వంద రోజుల పాలనపై  పవన్‌ చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉందన్నారు.





వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 19 రకాల చారిత్రాత్మక బిల్లులు తీసుకొచ్చామన్నారు. చాలా విషయాల్లో పవన్‌ అవగాహనలోపంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అన్ని నిధులను దారి మళ్లించి అవినీతి రాజ్యాన్ని స్థాపించిన సంగతిని విస్మరించరా అని ప్రశ్నించారు. అప్పుడు ఎందుకు పవన్‌ మాట్లాడలేదన్నారు.  పోలవరం ప్రాజెక్టు అవినీతిపై  ఎందుకు మౌనం వహించారని నిలదీశారు. కేవలం వంద రోజుల్లోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 4.5 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌ కి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని విజయవాడ, విశాఖల్లో పెద్ద కాన్ఫరెన్స్‌లు పెట్టిందన్నారు. ఎంత ఖర్చు పెట్టారు..ఎన్ని ఉద్యోగాలు కల్పించారని పవన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: