మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యను తెలుగు దేశం పార్టీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందన్న వాదనలు బాగా వినిపిస్తున్నాయి. కేవలం అక్రమంగా పెట్టిన కేసుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారాన్ని విరివిగా ఫోకస్ చేస్తూ వైసీపీ సర్కారును బోనులో నిలబెట్టే ప్రయత్నం జోరుగా చేస్తున్నారు. అక్రమ కేసులకు తోడు.. వైసీపీ నేతలు కూడా కోడెలను టార్గెట్ చేశారని చెబుతున్నారు.


ప్రత్యేకించి కోడెలపై జోరుగా కేసులు పెట్టాలంటూ విజయసాయిరెడ్డి ట్వీట్లు చేసిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ అంశాలపై తెలుగు దేశం వాదనను విజయసాయి రెడ్డి బాగానే తిప్పికొడుతున్నారు. మామూలుగా నే చంద్రబాబు అంటే ఒంటికాలిపై లేచే విజయ సాయి ఈ విషయంలో కాస్త ఘాటుగానే స్పందించారు.


మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణాన్ని రాజకీయం చేసిన చంద్రబాబు, ఆయన ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నారని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. గతంలో తాను కొనుగోలు చేసిన 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కోడెలను వాడుకున్న చంద్రబాబు, ఆ తర్వాత వదిలేశాడని విమర్శించారు. నమ్మినవారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు.


చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఓ సర్కస్ ట్రూపుగా మార్చేశారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇందులోభాగంగా చంద్రబాబు ఓ చోట టెంటు వేస్తారనీ, జనం పోగవగానే షో మొదలవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సర్కస్ కు వచ్చిన వాళ్లంతా తనకు ఓటేసినట్టేనని చంద్రబాబు హుషారై పోతారనీ, కానీ సర్కస్ చూసి చప్పట్లు కొట్టినవారు ఆ తర్వాత అది మర్చిపోతారన్న విషయం చంద్రబాబుకు ఎప్పటికీ అర్థం కాదని దుయ్యబట్టారు. చంద్రబాబును ఓ సర్కస్ మాస్టర్ గా పోలుస్తూ విజయ సాయి రెడ్డి చేసిన ట్వీట్ తెలుగుదేశం నేతలకు కోపం తెప్పిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: