ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై నెల‌కొన్న గంద‌ర‌గోళానికి సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చ‌ర‌మ‌గీతం పాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. సీఎం జ‌గ‌న్ స్పందించ‌కుంటే అమ‌రావ‌తిపై ఆధార‌ప‌డిన దాదాపు 18 ల‌క్ష‌ల కుటుంబాల పరిస్థితి అయోమ‌యంలో ప‌డుతుంది. అందుకే ఈ కుటుంబాల‌ ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా ఉండాలంటే సీఎం జ‌గ‌న్ తప్ప‌కుండా నోరు విప్పి అమ‌రావ‌తిపై క్లారిటీ ఇవ్వాల్సిన స‌మ‌యం అసన్న‌మైందని ఏపీ ప్ర‌జ‌లు అంటున్నారు. వాస్త‌వానికి ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడు ఏపీ మున్సిపాలిటి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అమ‌రావ‌తిపై గంద‌ర‌గోళ ప‌రిచే వ్యాఖ్యాలు చేశారు.


బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన గంద‌ర‌గోళ  వ్యాఖ్యాల‌తో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంటుందా.. లేక మ‌రోచోటకు త‌ర‌లుతుందా ? అనేది సందిగ్ధంగా మారింది. అమ‌రావ‌తి రాజ‌ధానిలో టీడీపీ ప్ర‌భుత్వం అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని, భూదందా జోరుగా సాగింద‌ని, ఏపీలో రాజ్య‌మేలిన టీడీపీ మంత్రులు, నాయ‌కులు భారీ భూమాయ‌కు పాల్ప‌డ్డారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ఏపీలో అధికారం చేతులు మార‌గానే అమ‌రావ‌తిలో భూదందాకు పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు ఉంటాయ‌ని, భూబ‌కాసురుల భ‌రతం ప‌డుతామ‌ని చెపుతూనే ఉంది వైసీపీ ప్ర‌భుత్వం.


అయితే బొత్స చేసిన వ్యాఖ్యాల‌తో అమ‌రావ‌తిలో రాజ‌ధాని త‌ర‌లిపోతుంద‌ని భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని అయితే   ల‌క్ష‌లాది ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ఎంద‌రో నిరుద్యోగులు, భూములు ఇచ్చిన రైతు కుటుంబాల పిల్ల‌లు ఎదురు చూస్తున్నారు. అయితే రాజ‌ధాని త‌ర‌లిపోతే ఉపాధి పోవ‌డంతో పాటు ఉద్యోగ అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతాయ‌నే ఆందోళ‌న‌లో యువ‌త‌, నిరుద్యోగులు ఉన్నారు.


ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు ఈ నిరుద్యోగులపై ఏపీ సీఎం జ‌గ‌న్ క‌నిక‌రం చూపి వెంట‌నే  స్పందించాల్సిన త‌రుణం ఆసన్న‌మైందనే చెప్ప‌వ‌చ్చు. అడిగిన‌వారికి అడ‌గ‌ని వారికి వ‌రాలు ఇస్తున్న జ‌గ‌న్ ఆందోళ‌న‌లో ఉన్న యువ‌త‌కు భ‌రోసా క‌ల్పించాల్సిన బాధ్య‌త సీఎం జ‌గ‌న్‌పై ఉంది. మ‌రి జ‌గ‌న్ దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇచ్చి ఇక్క‌డ ప్ర‌జ‌ల ఆందోళ‌న‌కు చెక్ పెడ‌తాడో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: