ఫుల్ లెంగ్త్ మ‌ద్ద‌తుతో రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ఏదో ఒక స‌మస్య వెంటాడుతూనే ఉంది. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్నించ‌డం ద‌గ్గ‌ర నుంచి.. ప్ర‌తివిష‌యంలోనూ ఎదురు దాడి చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధానంగా ప్ర‌జావేదిక‌ను కూల్చివేయ‌డం, చంద్ర‌బాబు నివాసానికి నోటీసులు ఇవ్వ‌డం.. ఇంకా ఈ ర‌గ‌డ సాగుతూనే ఉంది. ఇంత‌లోనే గుంటూరు జిల్లా ఆత్మ‌కూరు ద‌ళితుల ఘ‌ట‌న‌, ఆవెంట‌నే మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు దుర్మ‌ర‌ణంతో ప్ర‌భుత్వం ఉక్కిరి బిక్కిరి అయింది.


ఇవ‌న్నీ ఇలా ఉంటే రాజ‌ధాని అమ‌రావ‌తిపై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన కామెంట్లు మ‌రింత‌గా మంట పుట్టించాయి. దీంతో రోజుకో సీరియ‌ల్ రూపంలో నిత్యం ప్ర‌భుత్వంపై ఏదో ఒక వివాదం కొన‌సాగింది. రాజ‌ధానిని మారిస్తే.. ఊరుకోబోమ‌ని ప్ర‌తి ప‌క్షాల నాయ‌కులు ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తారు. స‌రే! ఇవ‌న్నీ ఇలా ఉంటే.. గోదావ‌రిలో బోటు ప్ర‌మాదం న‌ల‌భై మంది మృతి ఘట‌న కూడా జ‌గ‌న్ స‌ర్కారుకు ఇబ్బందిగానే ప‌రిణ‌మించింది. ఇక‌, పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌ర్లు, కేంద్రం నుంచి వార్నింగులు, ప్ర‌తిప క్షాల అల్టిమేటాలు ఇలా.. ఈ వంద రోజుల జ‌గ‌న్ పాల‌న‌లో అనేక సంచ‌ల‌నాలు చోటు చేసుకున్నాయి.


అయితే, వీటిలో ప్ర‌ధానం గా ప్ర‌భుత్వంపై వ‌చ్చిన విమ‌ర్శ‌.. రాజ‌ధాని అమ‌రావ‌తిని త‌ర‌లిస్తే.. ఊరుకోబోమ‌ని, అయితే, అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల‌కు విస్త‌రించాల‌నేది ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని మంత్రులు సెల‌విచ్చారు. ఇంత‌లో గోదావ‌రి ప్ర‌మాదం ఘ‌ట‌న తెర‌మీదికి రావ‌డంతో ఈ వివాదానికి కామా ప‌డింది. ఇక‌, ఇప్పుడు కొత్త‌గా మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. అదే రాష్ట్ర హైకోర్టు. కొన్ని మీడియాల్లో వ‌చ్చిన క‌థ‌నాల మేర‌కు కొన్ని రోజుల కింద‌ట కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను క‌లిసిన సంద‌ర్భంలో జ‌గ‌న్‌.. ఆయ‌న ద‌గ్గ‌ర హైకోర్టు విష‌యంపై మాట్లార‌ని స‌మాచారం.


ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌, అన్ని ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు స‌మ‌న్యాయం చేయాల‌నే త‌న ప్ర‌భుత్వ ప్రాధాన్యాన్ని జ‌గ‌న్ వివ‌రించార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పారిశ్రామికంగా ప్ర‌కాశం జిల్లాను, ఐటీ మ‌హాన‌గ‌రంగా విశాఖ జిల్లాను, వాణిజ్య రాజ‌ధానిగా విజ‌య‌వాడ‌ను, పాల‌నా ప్రాంతంగా మాత్ర‌మే అమ‌రావ‌తిని, ఆధ్మాత్మిక రాజ‌ధానిగా తిరుప‌తిని ఇలా ప్రాంతాల వారిగా.. పాల‌న‌ను అభివృద్ధిని వికేంద్రీక‌రించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం.


ఈ నేప‌థ్యంలోనే క‌ర్నూలు జిల్లాను న్యాయ న‌గ‌రంగా అభివృద్ధి చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అంటే.. హైకోర్టును ఇప్పుడున్న అమ‌రావ‌తి(నిజానికి ఇక్క‌డ నిర్మించిన భ‌వ‌నాల‌న్నీ కూడా తాత్కాలిక‌మే) నుంచి త‌ర‌లించి, క‌ర్నూలులో ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు ఓ వ‌ర్గం మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అంటే.. ఎప్ప‌టి నుంచో త‌మ జిల్లాను రాజ‌ధాని చేయాల‌ని, లేదా ప్ర‌ముఖంగా గుర్తించాల‌ని డిమాండ్ చేస్తున్న క‌ర్నూలు వాసుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు హైకోర్టును అక్క‌డ ఏర్పాటు చేయాల‌ని చూస్తున్నార‌ని తెలుస్తొంది.


గ‌త కొన్నాళ్లుగా క‌ర్నూలులో హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌ను ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ ఉంది. అయితే, ఇప్పుడు ఏకంగా కోర్టును త‌ర‌లించి అక్క‌డ ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కారు భావిస్తున్న‌ట్టు వార్త‌లు రావ‌డంతో న్యాయ‌వాదులు ఉద్య‌మాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: