ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం-ఒకే ఎన్నిక , ఒకే దేశం-ఒకే బాష....ఇవి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నినాదాలు. ఇందులో ఒకే దేశం-ఒకే పన్ను నినాదంతో జి‌ఎస్‌టి ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. అలాగే ఒకే దేశం-ఒకే ఎన్నిక పేరుతో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి ఒకే దేశం-ఒకే బాష నినాదం తీసుకొచ్చారు. అయితే దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకిత వచ్చింది. దీంతో అమిత్ షా వెనక్కి  తగ్గారు.


అయితే తాజాగా అమిత్ షా మరో నినాదంతో ముందుకు వచ్చారు. ఒకే దేశం-ఒకే గుర్తింపు కార్డు ఉండాలనే నినాదం తీసుకొచ్చారు. అంటే దీని ప్రకారం ఆధార్, ఓటర్ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్ పోర్ట్, బ్యాంక్ ఖాతా...ఇలా అన్నిటికీ కలిపి ఒకే కార్డు ఉండాలని అమిత్ షా అభిప్రాయపడ్డారు. అది సాధ్యమవుతుంది కూడా అని బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు(మల్టీపర్పస్‌ ఐడీ కార్డ్‌) ప్రతిపాదన గురించి అమిత్ షా సూచనప్రాయంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.


ఈ సందర్భంగా అమిత్ షా 2021 జనాభా లెక్కింపు గురించి కూడా ప్రస్తావించారు. ఈ సారి జనగణనను డిజిటల్‌ రూపంలో చేపడతామని అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ కూడా తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ జనాభా లెక్కింపుకు రూ. 12 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 2020కల్లా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌ను తయారు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని, ఒకసారి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ పూర్తయిన తర్వాత పాన్ ఇండియా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్‌కు ఇదే ఆధారంగా మారుతుందని చెప్పారు.


అయితే దేశంలో తలెత్తే ఎన్నో సమస్యలకు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ పరిష్కారం చూపుతుందని అన్నారు. అలాగే ఈ డిజిటల్ జనాభా లెక్కింపు ద్వారా ప్రజలకు అందవలసిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయని, ప్రజలు ఇచ్చే సమాచారం ఆధారంగానే పథకాలు లభిస్తాయని చెప్పారు. ఇక ఒకే దేశం ఒకే కార్డు విజయవంతమైతే....ఆధార్ గుర్తింపు కార్డుకు కాలం చెల్లే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: