‘పోలవరాన్ని మీరు చెప్పిన సమయం కంటే ముందుగానే పూర్తి చేస్తే టీడీపీని మూసేస్తారా.. రాజకీయ సన్యాసం తీసుకుంటారా..’ అని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీని ప్రశ్నించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు సంవత్సరాల్లో పోలవరాన్ని నిర్మించి తీరుతామని.. నవంబర్ నుంచి పనులు మొదలుపెట్టి డిజైన్ ప్రకారమే పోలవరం నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గిస్తామంటూ టీడీపీ చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలని కొట్టి పారేశారు.

 

 

 

వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రివర్స్ టెండర్ల ద్వారా రూ.800 కోట్లు ఆదా అయ్యిందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. నామినేషన్ల ద్వారా గతంలో ఇష్టానుసారంగా టెండర్లు ఇచ్చారని టీడీపీని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వంలో పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు. పోలవరం పనులు ఆగిపోవడం వల్ల నష్టం జరిగినట్లు టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారని.. వరదల కారణంగా నవంబర్ వరకు పనులు చేయలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇది గమనించకుండా టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు వారి అవివేకానికి నిదర్శనమన్నారు. రోజు వారి కమీషన్లు, వ్యక్తిగత ఆదాయం కోసమే టీడీపీ నేతలు చూశారని.. తమ జేబుల్లోకి వెళ్లిన కమీషన్ల బండారం బయటపడుతుందని టీడీపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలో నీటిపారుదలశాఖకు సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని రూ.వెయ్యికి లీజుకు తీసుకున్న టీడీపీ మాజీ మంత్రి ఉమా.. నీతి నిజాయితీ గురించి మాట్లాడటం విడ్దూరంగా ఉందని మంత్రి అనిల్ విమర్శించారు.

 

 

 

రాష్ట్రానికి ఆదాయం చేకూర్చే విధంగా జగన్ ముందుకెళ్తున్నారని తెలిపారు. 12.6 శాతం తక్కువతో పనులు చేసేందుకు మెగా సంస్థ ముందుకొస్తే.. టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని టీడీపీ అసత్యప్రచారం చేస్తోందని వెలుగొండ ప్రాజెక్టులో కూడా రివర్స్ టెండరింగ్‍కు వెళ్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. టెండర్ విధానంలోకి నవయుగ సంస్థ ఎందుకు రాలేదో టీడీపీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పారదర్శక బిడ్డింగ్‍పై ప్రశంసించడం పోయి విమర్శలు చేయడం టీడీపీకి తగదన్నారు. పోలవరంపై టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: