ఈ మధ్య కాలంలో గుండెపోటు, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గుండె సమస్యలు ఎక్కువగా మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఉన్నవారిలో వస్తున్నాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవటం, నిద్రలేమి, ఒత్తిడి గుండె జబ్బులకు కారణం అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈ మధ్య కాలంలో చేసిన ఒక సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 
 
ఈ సర్వే నివేదిక ప్రకారం హైదరాబాద్ నగరంలో నివసించే వారిలో 56 శాతం మందిలో గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 30 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 1226 మందిపై హైదరాబాద్, ఢిల్లీ, ముంబాయి నగరాల్లో ఈ సర్వేను నిర్వహించారు. 640 మంది మహిళలు, 586 మంది పురుషులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 
 
ఈ సర్వేలో ఢిల్లీ, ముంబాయి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో గుండె సమస్యలు వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉందని తెలిసింది. ఒత్తిడికి గురవుతున్న వారు ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందని తెలుస్తుంది. హైదరాబాద్ నగరంలో 88 శాతం మంది పొట్ట దగ్గర ఉండే కొవ్వు వలన గుండె సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. శరీరానికి తగినంత వ్యాయమం లేకపోవటం, నిద్రలేమి సమస్యల వలన కూడా ఎక్కువమంది గుండెజబ్బుల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. 
 
యువతలో చాలా మంది ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోవటం లేదు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే ఊబకాయం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వారానికి కనీసం 5 రోజుల పాటు వ్యాయామం చేయటం మరియు పండ్లు, కూరగాయలను ఆహారంలో తీసుకోవటం వలన ఊబకాయం మరియు గుండెకు సంబంధించిన సమస్యల నుండి బయటపడవచ్చు. జీవనశైలిలో మార్పులు చేసుకోవటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. 




మరింత సమాచారం తెలుసుకోండి: