తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంటే....కాంగ్రెస్ కంచుకోటని బద్దలుగొట్టి తమ వశం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుంది. వాస్త‌వంగా చూస్తే ఇది పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సిట్టింగ్ సీటు. దీంతో ఇక్క‌డ ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి మ‌రీ త‌న భార్య అయిన కోదాడ మాజీ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తికి సీటు ఇప్పించుకున్నారు.


ఇక్క‌డ గెలిస్తేనే ఉత్త‌మ్ ప‌రువు నిల‌బ‌డుతుంది. ఒక‌వేళ టీఆర్ఎస్ గెలిస్తే ఉత్త‌మ్ కంచుకోట బ‌ద్ద‌లైన‌ట్టే. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీఆర్ఎస్ అభ్య‌ర్థి కేవ‌లం 7 వేల ఓట్ల‌తోనే ఓడిపోయారు. దీంతో ఇక్క‌డ గెలిచి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డికే చెక్ పెట్టాల‌ని టీఆర్ఎస్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రోవైపు బీజేపీ ఇక్క‌డ రేసులో ఉన్నా ఆ పార్టీ ప్ర‌భావం అంతంత మాత్రంగానే ఉంటుంద‌న్న‌ది వాస్త‌వం.


ఇక ఈ ఉప ఎన్నిక‌కు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సాయం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఇప్పటికే తమ పార్టీ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో ఓడిపోయిన సైదిరెడ్డినే మళ్ళీ బరిలోకి దించారు. ఇక ఇక్క‌డ గెలుపు కోసం కేసీఆర్, జ‌గ‌న్ సాయం ఎందుకు కోరార‌న్న సందేహం స‌హ‌జంగానే ఉంటుంది. ఇక్క‌డ వైసీపీకి మంచి బ‌లం ఉంది. ఇక్కడ దివంగత వైఎస్సార్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానలో పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి  గట్టు శ్రీకాంత్ రెడ్డి దాదాపు 27 వేల ఓట్లు సాధించి కాంగ్రెస్, టీఆర్ఎస్ తర్వాత మూడో స్థానంలో నిలిచారు.


ఆ త‌ర్వాత జ‌గ‌న్ ఏపీ మీద కాన్‌సంట్రేష‌న్ చేసి తెలంగాణ‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ఇప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య ఎంతో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్‌కు కూడా బ‌ల‌మైన అభిమానులు ఉన్నారు. ఇది ఆంధ్రా స‌రిహ‌ద్దు నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో వైసీపీ ప్ర‌భావం ఎంతో కొంత ఉంది. అందుకే జ‌గ‌న్ సైతం తాజాగా కేసీఆర్ భేటీలో ఇక్క‌డ టీఆర్ఎస్ గెలుపు కోసం సాయం చేస్తామ‌ని మాట ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న వైసీపీ మ‌ద్ద‌తు దారుల‌తో వైసీపీ కీల‌క నేత‌లు స‌మావేశ‌మైన టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: