ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం విధానం అందుబాటులోకి రానుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలా మద్యం దుకాణాలను నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు కేసీయార్ ఇప్పటికే ఈ విషయం గురించి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తే వచ్చే లాభాలు, ఇబ్బందులు, సిబ్బంది, నియామకాలు తదితర విషయాల గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం నివేదిక కోరినట్లు తెలుస్తుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ విషయం గురించి ప్రజాభిప్రాయం కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. సోమవారం రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చలో ఈ విషయం గురించి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారని సమాచారం. 
 
తెలంగాణ రాష్ట్రంలో 2216 మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. రెండేళ్ల పాలసీ కింద ప్రభుత్వం షాపులను అప్పగించటంతో పాటు ఎక్సైజ్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహించటం ద్వారా 2000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న సమయంలో కొన్ని బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే విక్రయించేవారు. 
 
మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్ లు దొరికేవి కావు. ప్రభుత్వ ఆధీనంలో మద్యం దుకాణాలు నడిపిన తరువాత అన్ని బ్రాండ్ లు అందుబాటులో ఉంటాయో లేదో అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలు నిర్వహించిన ప్రైవేట్ వ్యక్తులు మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోవటంతో తెలంగాణలో మద్యం దుకాణాలను దక్కించుకోవాలని అనుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం దుకాణాలను నిర్వహిస్తే మాత్రం ఇంతకాలం మద్యం దుకాణాలు నిర్వహించిన రెండు రాష్ట్రాల మద్యం వ్యాపారులకు షాక్ అని చెప్పవచ్చు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: