ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెల‌ల్లోనే ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లోపేతం అయ్యేందుకు త‌మ వ్యూహాల‌ను మార్చుకుంటోంది. ఇప్ప‌టికే పాల‌కొల్లు లాంటి చోట్ల ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వారిని ప‌క్క‌న పెట్టి కొత్త‌వాళ్ల‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు ఇచ్చారు. ఇక ఇప్పుడు కీల‌క‌మైన ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ చంద్ర‌బాబు తోడ‌ళ్లుడు అయిన సీనియ‌ర్ నేత డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు చెక్‌ పెట్టే దిశగా తొలి అడుగు వేశారు. ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్‌బై చెప్పిన రావి రామనాథంబాబును పార్టీలో చేర్చుకోవడంతోనే ద‌గ్గుపాటిని ప‌క్క‌న పెట్టే ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని అంటున్నారు.


గత ఫిబ్రవరి వరకూ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని చేసిన రావి రామనాథంబాబు(రాంబాబు)ను త‌ప్పించిన జ‌గ‌న్ ద‌గ్గుపాటి పార్టీలోకి రావ‌డంతో ఆయ‌న్ను త‌ప్పించి ద‌గ్గుపాటికి ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు ఇచ్చారు. అయితే మ‌న‌స్థాపం చెందిన రామ‌నాథం బాబు ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరిపోయి టీడీపీ క్యాండెట్ ఏలూరి సాంబ‌శివ‌రావు గెలుపు కోసం ప‌నిచేశారు. ఇక ఎన్నిక‌లు ముగిసిన మూడు నెల‌ల‌కే జ‌గ‌న్ తిరిగి రామ‌నాథం బాబును తిరిగి పార్టీలోకి తీసుకున్నారు.


ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించిన వ్య‌క్తినే ఇప్పుడు త‌న‌కు చెప్ప‌కుండా పార్టీలో చేర్చుకోవ‌డం అంటే ద‌గ్గుపాటికి షాకింగ్ లాంటిదే. రామ‌నాథంబాబు చేరిక విషయంపై డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కనీస సమాచారం ఇచ్చారా లేదా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. రామ‌నాథం బాబుకు స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ కండువాకప్పి పార్టీలో చేర్చుకోవడం విశేషం. నిజానికి ఇప్పటికిప్పుడు రాంబాబును పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరాలు ఏమీ లేవు. అయితే జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ పరిశీలకుడు, ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల ప్రత్యేక ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ల సమక్షంలో ఆయనను పార్టీలో చేర్చుకున్నారు.


ఈ చేరిక‌లో డాక్ట‌ర్ ద‌గ్గుపాటి కాని లేదా ఆయ‌న కుమారుడు హితేష్ చెంచురామ్ కాని అక్క‌డ లేరు. అలాగే నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ కన్వీనర్లు, ఆపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి కూడా హాజరయ్యారు. దీంతో ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన రాంబాబుకు తిరిగి ఇంత ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో చేర్చుకోవడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్న రాజకీయవర్గాలలో ఉత్పన్నమైంది. ఏదేమైనా జ‌గ‌న్ ద‌గ్గుపాటికి చెక్ పెట్టే క్ర‌మంలోనే రామ‌నాథం బాబును పార్టీలో చేర్చుకున్న‌ట్టు చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: