హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుండి ఆకస్మికంగా భారీ ఎత్తున వర్షాలు కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని గుడిమల్కాపూర్, రెడ్ హిల్స్, నాంపల్లి, శ్రీనగర్ కాలనీ, జూబ్లీహిల్స్, కార్వాన్, ఆసిఫ్ నగర్ లతోపాటు అనేక ప్రాంతాల్లో  10 నుండి 15 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అనేక కాలనీలు, పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రాత్రి కురిసిన భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితులను నగర మేయర్ బొంతు రామ్మోహన్  సమీక్షించారు. జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు, విజిలెన్స్ డైరెక్టర్  విశ్వజిత్ కంపాటిలతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పూర్తిగా అప్రమత్తం చేశారు. నగరంలో జలమయమైన ప్రాంతాలకు వెంటనే  వర్షాకాల ఎమర్జెన్సీ బృందాలను పంపి సహాయ చర్యలను చేపట్టారు. అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపొయాయి.


కూలిన చెట్లను డీ.ఆర్.ఎఫ్ బృందాలు రొడ్ల పై నుండి తొలగించాయి. హుస్సేన్ సాగర్ లో కి నాలా ఒకవైపు గోడ పాక్షికంగా కూలడంతో రాజ్ భవన్ ఎదురుగా గల మదర్సా  మక్త ( ఎం.ఎస్ మక్తా) బస్తీలో కి వరద నీరు ప్రవేశించి  జలమయం అయింది.  ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే నగర మేయర్ బొంతు రామ్మోహన్ డిజాస్టర్ రెస్క్యూ బృందాలను ఎంఎస్ మక్తాకు పంపడంతో పాటు  తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆయన ఎం.ఎస్ మక్తకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు 200 కు పైగా ఇల్లు జలమయమయ్యాయి.  రెండు డిజాస్టర్ రిలీఫ్ బృందాలతో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను హుటాహుటిన  ఎం.ఎస్ మక్త కు తరలించడంతో పాటు సంఘటన స్థలంలో తానే స్వయంగా ఉండి సహాయక చర్యలను మేయర్ పర్యవేక్షించారు. అనంతరం శ్రీనగర్ కాలనీలోని ప్రధాన రహదారిపై కూలిన చెట్టును స్వయంగా దగ్గర ఉండి డి.ఆర్.ఎఫ్ బృందాలచే తొలగింపజేశారు.



నగరంలోని పలు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు జలమయం కాగా జిహెచ్ఎంసి మన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు స్పందించి నగరవాసులకు ఏవిధమైన ఇబ్బందులులేకుండా చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా బేగంపేట్, ఆనంద్ బాగ్, చందానగర్, కూకట్ పల్లి, చార్మినార్ సర్కిల్ లోని పలు ప్రాంతాల్లో డి.ఆర్.ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు వెంటనే చేరుకొని స్థానికులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈస్ట్ ఆనంద్ బాగ్ లో డి.ఆర్.ఎఫ్ బృందాలు ప్రత్యేక బోట్ ల ద్వారా వెళ్లి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, నిత్యవసర వస్తువులైన పాలు, బ్రెడ్ ఇతర ఆహార పదార్థాలను అందజేశాయి. కాగా భారీ వర్షాల వల్ల జిహెచ్ఎంసి డి.ఆర్.ఎఫ్, మన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు సకాలంలో స్పందించడం పట్ల నగరవాసులు, నెటీజన్లు అభినందనలు వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: