రాజ‌కీయాల్లో వ్యూహాలు ప్ర‌తివ్యూహాలు కామ‌న్. అదేస‌మ‌యంలో ప్ర‌త్య‌ర్తుల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు కోలు కోకుండా చేయ‌డం కూడా రాజ‌కీయాల్లో ఓ భాగం. ముఖ్యంగా అధికార పార్టీ నాయ‌కులు త‌మ ప‌ద‌వులను, పీఠాల‌ను కాపాడుకునేందుకు చేసే ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్ర‌మంలోనే ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు దెబ్బకొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి ప‌రిస్థితే.. తెలంగాణ కాంగ్రెస్‌కు ఎదురు కాబోతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ పార్టీ కి బ‌ల‌మైన వాయిస్‌గా ముఖ్యంగా మైనారిటీల నుంచి బ‌ల‌మైన నేతగా ఉన్న అజ‌హ‌రుద్దీన్‌కు కేసీఆర్ వ‌ల‌విసిరార‌ని స‌మాచారం.


టీమ్ ఇండియా క్రికెట్‌కు మాజీ కెప్టెన్ అయిన అజ‌హ‌రుద్దీన్‌.. కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఎంపీగా కూడా గ‌తంలో ఆయ‌న విజ‌యం సాధించారు. కొన్ని సార్లు ఓడిపోయారు. అయితే, 2000 సంవ‌త్స‌రంలో ఆయ‌న‌పై క్రికెట్ సంఘం వేటు వేసింది. దీంతో అప్ప‌టి నుంచి దూరంగా ఉన్న అజ‌హ‌రు ద్దీన్.. ఇప్పుడు హైద‌రాబాద్ క్రికెట్ సంఘానికి అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. తాజాగా జ‌రిగిన ఈ సంఘం ఎన్నిక‌ల్లో అజ‌హ‌రుద్దీన్‌కు 174 ఓట్లు వ‌చ్చాయి. దీంతో భారీ విజ‌యం న‌మోదు చేశారు. అయితే, దీనికి వెనుక టీఆర్ ఎస్ పెద్ద‌లు ఉన్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.


ముఖ్యంగా క్రికెట్ అంటే ఇష్ట‌ప‌డే..కేటీఆర్‌.. అజ‌హ‌ర్‌కు అన్నివిధాలా సాయం చేశార‌ని, అందుకే భారీ మె జారిటీ సాధ్య‌మైంద‌ని అంటున్నారు. ఇక‌, దీనికి వెనుక ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప‌రిస్థితి ఏమంత బాగాలేదు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌.. అజ‌హ‌రుద్దీన్‌ను త‌న పార్టీలోకి తీసుకో వాల‌ని భావి స్తున్న‌ట్టు చెబుతున్నారు. ఇప్ప‌టికే చాలా మంది కాంగ్రెస్ నాయ‌కులు పార్టీ మారిపోయిన నేప‌థ్యంలో ఇప్పుడు అజ‌హ‌ర్‌పై కేసీఆర్ క‌న్నేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.


ఈయ‌న పార్టీలోకి రావ‌డం ద్వారా.. కాంగ్రెస్‌కు మైనారిటీ ఓటు బ్యాంకు దూరం కావ‌డంతోపాటు త‌న‌కు చేరువ అవుతుంద‌ని కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ క్రికెట్ సంఘం అధ్య‌క్షుడిగా విజ‌యం సాధించేందుకు తెర‌వెనుక కేసీఆర్ మంత్రాంగం చేసిన‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఇదే నిజ‌మైతే.. కాంగ్రెస్‌ను అజ‌హ‌ర్ వీడ‌డం ఖాయ‌మేన‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: