గ్రామ‌ సచివాలయ ఉద్యోగాలలో పది శాతం ఈడబ్లూసి రిజర్వేషన్ అమలు‌ చేయాలని  కోరామని బిజెపి ఎపి అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు అవుట్ సోర్సింగ్ విధానంలో పని‌ చేస్తున్న వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వారిని రోడ్డున పడేయ కూడదుగా అని కన్నా హితవు చెప్పారు. సెప్టెంబరు ఐదు నుండి ఇసుక కొరత ఉండదన్నారు. ఇప్పటికి ఆ సమస్యకు   పరిష్కారం చూపలేకపోయారని విమర్శించారు. దేవాలయ ఆస్తులను పక్కదారి పట్టించవద్దని చెప్పామన్నారు. ఈ మూడు అంశాల పై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని కన్నా డిమాండ్ చేశారు.



ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుబడితే... తమ పై వ్యక్తిగతంగా ఎదురు దాడి‌ చేయడం సరికాదన్నారు. తాను బిజెపి అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి   సందర్భం వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు ను‌ విమర్శిస్తూ వచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు. ఆనాడు‌ చంద్రబాబు వైసీపీ మౌత్ పీస్ అని అన్నారు. మరి ఇప్పుడు జగన్ పాలనలో లోపాలను ఎత్తి చూపితే టిడిపి మౌత్ పీస్ అంటున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ పరమైన కార్యక్రమాలను సెప్టెంబర్ నెలలో శ్రీకారం చుట్టామని చెప్పారు. అక్టోబర్4వ తేదీన యువమోర్చా, బిజెపి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాచేపట్టనున్నట్టు తెలిపారు. ఇసుక కొరత వల్ల లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అప్పులు పాలై.. తినడానికి తిండి లేక పస్తులుంటున్నారు. అక్టోబరు7వ తేదీన కార్మికులతో కలిసి భిక్షాటన చేపడతామని చెప్పారు.



అక్టోబర్11వ తేదీన పోలవరం సందర్శించి వాస్తవ పరిస్థితులు వివరిస్తామన్నారు. ముంపు‌ ప్రాంత వాసులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ  మూడు సమస్యలపై  గవర్నర్ కు వివరించనున్నట్టు తెలిపారు. గతంలో చంద్రబాబు పరిపాలన తరహాలోనే జగన్ పాలనా తీరు ఉందని అందుకే గవర్నర్ కు దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు చెప్పారు.  అక్టోబర్2వ తేదీ మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా బిజెపి వివిధ కార్యక్రమాలకు  రూపకల్పన చేసినట్టు కన్నా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అక్టోబర్2 నుంచి 30వ తేదీ వరకు పాదయాత్ర లు చేపట్టాలని నిర్ణయించామన్నారు. అక్టోబర్ రెండో తేదీన గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించి, మొక్కలు నాటుతామని చెప్పారు. అక్టోబర్ 15 నుంచి ఎపి వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ  మహాత్ముని మంచి మాటలు వివరిస్తామన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: