జగన్‌ అధికారంలోకి వచ్చాక ప్రజల జీవితాల్లో చీకట్లు నింపారని, ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్‌లేకుండా చేసి రాష్ట్రాన్నే చీకట్లపాలు చేశారని టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌  అన్నారు.  వైసీపీ పాలనలో కరెంట్‌ రాకడ పోకడ ఎప్పుడనేది ఎవరూ చెప్పలేకుండా ఉన్నారన్న ఆయన, విద్యుత్‌రంగంపై దృష్టిపెట్టకుండా పీపీఏల (పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్స్‌) రద్దుకు పాల్పడిన ప్రభుత్వం, ప్రజలను చీకట్లపాలు చేసిందన్నారు. విద్యుత్‌ విషయంలో హైకోర్టుని, కేంద్రాన్ని తప్పుదారి పట్టించిన జగన్‌ సర్కారు, తమ చేతగానితనాన్ని తెలుగుదేశం ప్రభుత్వంపై మోపుతూ ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోందని మద్దాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

2014లో టీడీపీ అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర విద్యుత్‌రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, 22.5మిలియన్‌ యూనిట్లకు పైగా విద్యుత్‌లోటుతో కునారిల్లుతున్న   విభజనానంతర రాష్ట్రాన్ని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన దూరదృష్టితో   కేవలం 100రోజుల్లోనే, మిగులువిద్యుత్‌ ఉన్న రాష్ట్రంగా మార్చారని గిరి గుర్తుచేశారు. సహజంగా వర్షాకాలంలో విద్యుత్‌ వినియోగం తక్కువగా ఉంటుందని, అలాంటి రోజుల్లోనే   ఎప్పుడుపడితే అప్పుడు కోతలు విధిస్తున్న ప్రభుత్వం మండువేసవిలో ప్రజలను మరింత ఇబ్బందులు పెట్టడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్యే స్పష్టంచేశారు. 


శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ల్లో పుష్కలంగా నీరుందని, ఈ సమయంలో 2,200మెగావాట్ల విద్యుత్‌ అదనంగా రాష్ట్రానికి వచ్చేఅవకాశం ఉన్నప్పటికీ, దాన్ని సద్వినియోగం చేసుకోలేని దుర్భరస్థితిలో ప్రభుత్వం ఉండటం, రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని గిరి ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్‌ రంగం విషయంలో జగన్‌ చర్యలు చూస్తుంటే, 2011లో మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక రంగం కుదేలయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పీపీఏల విషయంలో ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహరించడం వల్లే రాష్ట్రం చీకటిమయమైందన్నారు. రాష్ట్రచరిత్రలో ఎన్నడూలేనివిధంగా వైసీపీప్రభుత్వం వ్యవహరిస్తోందన్న గిరి, విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకుండా వాటిని వేధించడంవల్లే విద్యుత్‌ కొరతలు తలెత్తాయని గిరిధర్‌ పేర్కొన్నారు. 


నామాటే శాసనం, నేను చెప్పిందే వేదమన్నట్లుగా ప్రభుత్వాధినేత వ్యవహరించడం వల్లే, నేడు థర్మల్‌, సౌర, పవన విద్యుదుత్పత్తి మొత్తం నిలిచిపోయిందన్నారు. రాష్ట్రంలో బొగ్గుకొరతతో థర్మల్‌ కేంద్రాలు మూతపడేవరకు ప్రభుత్వం ఏంచేసిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. థర్మల్‌ పవర్‌తో ఇబ్బందులు  వస్తున్నాయని గ్రహించే, గత ప్రభుత్వం పర్యావరణహితమైన పవన, సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తే, ఎక్కువధరకు విద్యుత్‌కొనుగోలు చేశారంటూ నానాయాగీ చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడేం సమాధానం చెబుతుందని గిరి ప్రశ్నించారు. 


వైసీపీ ప్రభుత్వం వచ్చాక తమకు బకాయిలు ఇవ్వడం లేదని చెప్పి, విద్యుత్‌ఉత్పత్తి సంస్థలు కోర్టుకెళ్లాయని,   దేశంలో ఎక్కడాకూడా విద్యుత్‌ కొనుగోలు చేయలేని స్థితిలో రాష్ట్రం ఉందన్నారు. గత ప్రభుత్వం పీపీఏల విషయంలో రూ.4.64పైసలకు కొనుగోలు చేసిందని, ఆ ధర చాలా ఎక్కువని చెప్పిన జగన్‌సర్కారు, ఎన్టీపీసీ నుంచి రూ.6కు ఎలా కొనుగోలు చేసిందని టీడీపీనేత ప్రశ్నించారు. 2009లో రాజశేఖర్‌రెడ్డి యూనిట్‌విద్యుత్‌ను రూ.11కు కొంటే,  ఆనాడు పేరుకుపోయిన బకాయిలను 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక చెల్లించ డం జరిగిందన్నారు. పవన, సౌర విద్యుత్‌ ఆపేసి, బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఆధారపడిన  ప్రభుత్వం, ఒడిస్సా నుంచి కేసీఆర్‌ నుంచి బొగ్గు ఎందుకు కొనలేకపోతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి ఆరోపణలు చేసిన జగన్‌, ప్రభుత్వం అధికారం చేపట్టాక కూడా అదేపంథాలో పబ్బం గడుపుకుంటోందని గిరి మండిపడ్డారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: