సాధారణంగా బ్లడ్ గ్రూపులు చాలా రకాలుగా ఉంటాయి. ఎవరికైనా రక్తం ఎక్కించాలంటే అదే బ్లడ్ గ్రూపుకు చెందిన రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. కానీ కొన్ని సమయాల్లో ఒకే రకం బ్లడ్ గ్రూపు రక్తం దొరకటం అంత తేలిక కాదు. రక్తం దొరకక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్, రక్తహీనత సమస్యలతో బాధ పడేవారికి అంత సులభంగా రక్తం దొరకదు. 
 
ఈ సమస్యలకు పరిష్కారంగా జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు కృత్రిమ రక్తాన్ని కనిపెట్టారు. జపాన్ లోని తోకోరోజవా నగరంలోని శాస్త్రవేత్తల బృందం అక్కడి నేషనల్ డిఫెన్స్ కాలేజీలో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. శాస్త్రవేత్తలు రూపొందించిన రక్తంలో ఎర్రరక్తకణాలు మరియు ప్లేట్ లెట్స్ ఉంటాయి. శాస్త్రవేత్తలు ఈ రక్తాన్ని రక్తహీనత సమస్యతో బాధ పడే కొన్ని కుందేళ్లపై ప్రయోగించటం జరిగింది. 
 
ఈ పరిశోధనల్లో రక్తం ఎక్కించిన కుందేళ్లు ప్రాణాలతో నిలిచాయి. భవిష్యత్తులో ఈ రక్తం మనుషుల ప్రాణాలను కూడా కాపాడే అవకాశం ఉంది. సాధారణంగా ఓ నెగటివ్ రక్తం అన్ని గ్రూపుల వ్యక్తులకు సరిపోతుంది. కానీ ఈ గ్రూపు రక్తం దొరకటం అంత సులభం కాదు. ఈ గ్రూపు రక్తం కలిగిన వ్యక్తులు కూడా చాలా అరుదుగా ఉంటారు. 
 
సాధారణంగా మనుషులు దానం చేసిన రక్తం నిల్వ ఉంచటం చాలా కష్టంతో కూడుకున్న పని. కొన్ని సందర్భాల్లో నిల్వ ఉంచిన రక్తం స్వభావం మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ శాస్త్రవేత్తలు తయారు చేసిన కృత్రిమ రక్తం ఒక సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందని సమాచారం. శాస్త్రవేత్తలు రక్తం ఎక్కించిన కుందేళ్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలుస్తోంది. మనుషులపై కూడా ఈ రక్తం ప్రయోగించి పరిశోధనలు చేసి విజయం సాధిస్తే మాత్రం భవిష్యత్తులో లక్షల సంఖ్యలో ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: