బీహార్ రాష్ట్రాన్ని వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి.  ఈ వరదల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  పాట్నాలో  రోడ్లు నదులను తలపిస్తున్నాయి.  లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరదను సమీక్షిస్తూ సహాయక చర్యలు తీసుకుంటోంది.  విచిత్రం ఏమిటంటే.. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ పార్టీల నేతలు, మంత్రులు కూడా ఈ వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  


బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ సైతం వరద బారిన పడ్డారు.  అయన నివసిస్తున్న ఇంట్లోకి వరదనీరు రావడంతో అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలివెళ్లారు.  రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు సైతం వరద సహాయక చర్యలు చేపట్టారు.  ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.  ఇదిలా ఉంటె, బీహార్ రాజధాని పాట్నాలో వరద బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ ఎంపీ కృపాల్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు.  


సహాయం చేసి వరదల్లో చిక్కుకున్న ప్రజలను పరామర్శించేందుకు అయన ఓ రబ్బరు బోటులో బయలుదేరి వెళ్లారు.  అయితే,  నదిలో వరదనీరు ఎక్కువగా ఉండటంతో బోటు ప్రమాదవశాత్తు మునిగింది.  దీంతో అయన బోటులోనుంచి నీళ్లలో పడిపోయాడు.  అయితే, అది గమనించిన స్థానికులు వెంటనే కాపాడి బయటకు తీసుకొచ్చారు.  అప్పటికే అయన స్పృహ కోల్పోయారు.  కాసేపటి తరువాత కోలుకున్నారు. దీనిని బట్టి బీహార్ లో వరదనీరు ఎలా ప్రవహిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

వరద కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు.  బీహార్ రాష్ట్రానికి కేంద్రం అన్ని రకాలుగా సహాయం అందిస్తోంది.  బీహార్ లో వరదలు తగ్గుముఖం పడితే.. తిరిగి ప్రజలను మాములు స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.  లేదంటే ఈ ఇబ్బందులు ఇంకా కొంతకాలం కొనసాగాల్సి వస్తుంది.  గతంలో ఎన్నడూ లేనంతగా బీహార్ ను వర్షాలు ముంచెత్తుతుండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: