కారణాలేవైనా కానివ్వండి "ఐకమత్యమే బలం" అన్న నానుడి ఈ దేశానికి చేస్తున్న అపకారం అంతా ఇంతా కాదు. యూనియన్ ల పేరుతో ఐఖ్యతతో ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె సాధారణ ప్రజలను తమ కుటుంబ సభ్యులను స్నేహితులను పండుగల వేళ కలవనివ్వని దుర్మార్గానికి ఒడి గడుతుంది. ప్రస్తుతం దసరా నవరాత్రులు తరుణం ఉభయ రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ సమయంలో ఇరు రాష్ట్రాల వారు ముఖ్యంగా తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్ కు అటు నుంచి ఇటు ఇటునుంచి అటు ఉద్యోగ వ్యాపారాల రీత్యా సెటిలైన వాళ్ళు ఈ పర్వదినాలను ఆలంబన చేసుకొని తమ వారితో కొద్దిరోజులు గడపటానికి రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. 


ఇలాంటి సమయాన్ని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చెయ్యటానికి ఆర్టీసి ఉద్యోగులు సమ్మె అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఇది తరచుగా జరిగే విషయమే. అసలే ఆర్ధిక మాంద్యంతో దేశం ఆర్ధికంగా తల్లడిల్లుతున్న వేళ్ళ ప్రజలు వెచ్చాలు మొదలైన నిత్యావసరాలు కొనడానికే పడరాని పాట్లు పడుతున్నారు. ఉల్లి టమాటా లాంటి రోజువారి ఆహార అవసరాలు కొనలేక చస్తున్న సాధారణ తెలుగువారికి కనీసం సంవత్సరానికి ఒకసారైనా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపటానికి సహకరించని ఆర్టీసీ ఉద్యోగుల ఐఖ్యతతో చేసే సమ్మె దుర్మార్గమైనదే కాదు క్షమించరానిది కూడా! 
Image result for telangana RTC employees strike
దేశంలో సామాన్యుడు అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్నవేళ - హైదరాబాద్ నుండి పండుగకు విజయవాడ వెళ్ళటానికి వేల రూపాయిల ఖర్చు భరించ గలడా! మానవత్వంతో ఆలోచించవలసిన వేళ ఈ అమానవీయ చర్యలకు దిగుతున్న ప్రతి ఆర్టీసీ ఉద్యోగీ మానవత్వం మరచిన మనిషి మాత్రమే. మీరు ప్రభుత్వంపై పోరాటం జరిపి మీ ప్రయోజనాలు తీర్చుకోవటానికి మీ సోదర సామాన్యులను కడగళ్ళపాలు చేస్తారా? 


దేశంలో ఒక ప్రక్క నిరుద్యోగం ప్రభలుతుంటే - మరో ప్రక్క ప్రభుత్వ ఉద్యోగులైన వీళ్ళ తీరు గర్హనీయం. ఉద్యొగం రానంతవరకు ఉద్యోగం లేదని బాధపడతారు. అది రాగానే ఇందులో ఎక్కువ మంది అవినీతి అక్రమాలకు పాలబాడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయటానికి తీవ్ర నిర్లక్ష్యం, జాప్యం, బాధ్యతారాహిత్యం తప్ప పూర్తి బాధ్యతతో పనిచేసే ఉద్యోగి నేటి కాలంలో కలికానికి కూడా కనిపించటం లేదంటే అతిశయోక్తికాదు. 


ప్రజాసేవలను సరిగా నిర్వహించే విషయంలో ఎలాంటి అసంబద్ధతకు తావివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అది మరచిన ప్రభుత్వం యూనియన్లతో రాజకీయ సఖ్యత కోసం, ఎన్నికల్లో గెలుపు కోసం అయిన దానికి కాని దానికి వీళ్ళకు తలవంచటం గర్హనీయం. తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్నంతమాత్రాన తెలంగాణా రాగానే  "ప్రజలను కాల్చుతినమనే  లైసన్స్" వీరికి ఎవరిచ్చారు?  
Image result for telangana RTC employees strike
ప్రభుత్వాధికారంలో ఉన్నదెవరైనా ఇలాంటి గొంతెమ్మ కోరికలను తీర్చవలసిన పని లేదు. వారు వీరు కొట్టుకుంటే మద్యన నలిగిపోయేది సామాన్యుడే అన్న విషయం ఎవరూ మరచిపోగూడదు. దయచేసి ఆర్టీసీ ఉద్యోగ నేతల్లారా! మీ మంకుపట్టు వదిలేసి పండగలవేళ మీ కాటిన్యాన్ని, కార్పణ్యాన్ని వదిలేస్తేనే మీపై ప్రజల సానుభూతి ఉంటుంది. 
Image result for telangana RTC employees strike
తెలంగాణా ముఖ్యమంత్రి గారు! అవసరమైతే నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి ఆర్టీసీని యువతతో నడిపించండి. లేకుంటే మీకు దమ్ముంటే ఆర్టీసీని ముఖ్యమైన రెగులేటరీ నిబందనలతో బహు ముఖంగా ప్రయివేటైజ్ చేయండి. దాంతో పోటీ పెరిగి ప్రవేట్ సంస్థలు సరిగా పని చేసే అవకాశం ఉంటుంది. ఆర్ధిక మాంద్యంలో ఆర్టీసీ సమ్మె జనం పాలిట శాపంగా పరిణమించ కూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: