గ్రేటర్ హైదరాబాద్ లో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా నగరంలోని చెరువుల్లో దోమల నిర్మూలనకు ఆయిల్ బాల్ ప్రయోగాన్ని జిహెచ్ఎంసి చేపట్టింది. గణేష్ నిమజ్జనాలకు ప్రత్యేకంగా నిర్మించిన 28 కొలనుల్లో లార్వా నివారణకు గంబూసియా చేపలను వదిలిన జిహెచ్ఎంసి నగరంలోని పెద్ద చెరువులు, కుంటల్లో దోమల ఉత్పత్తికి కారణమయ్యే లార్వా నివారణకు ఆయిల్ బాల్స్ ను నేడు చెరువుల్లో వదిలారు. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి జోన్ లోని చెరువులు, కుంటల్లో దోమల నివారణకు డ్రోన్ల ద్వారా యాంటి లార్వా మందును స్ప్రే చేశారు. అయితే నగరంలోని ఇతర జోన్లలో డ్రోన్లవాడకంపై నిషేదం ఉన్నందున ఈ చెరువుల్లో దోమల నివారణకు పలు ప్రయత్నాలను జిహెచ్ఎంసి ఎంటమాలజి విభాగం చేపట్టింది. 



ఎల్బీనగర్ జోన్ లోని మన్సూరాబాద్ పెద్ద చెరువు, నాగోల్ చెరువు, బండ్లగూడ చెరువు, అయ్యప్ప కాలనీ నాలా తదితర చెరువుల్లో ఆయిల్ బాల్స్ ను వేయడం జరిగింది. ఈ ఆయిల్ బాల్స్ ద్వారా చెరువు నీటిపై ఆయిల్ తెట్ట పర్చుకొని దోమల నివారణ, లార్వా అభివృద్ది పూర్తిగా నిలిచి తద్వారా దోమల నివారణ జరుగుతుంది. ఆయిల్ బాల్స్ తయారీ ఈ విధంగా ఉంటుంది. ముందుగా గోనె సంచిని చిన్న చిన్న ముక్కలుచేసి దానిలో రంపపు పొట్టువేసి బంతిలాగా తయ్యారు చేస్తారు. ఈ బంతిని మస్కిటో లార్వా సీడల్ ఆయిల్ (ఎం.ఎల్.ఓ) కలిగిన డ్రమ్ లో  24గంటలకు పైగా నానబెట్టిన అనంతరం ఆ బాల్స్ ను తీసి చెరువుల్లో, కుంటల్లో వేస్తారు. ఈ బాల్స్ ద్వారా ఎం.ఎల్.ఓ ఆయిల్ తెట్ట పల్చగా నీటిపై పర్చుకొని దానిపై ఉన్న దోమ, లార్వాలు చనిపోయి దోమ ఉత్పత్తి లేకుండా చేస్తుంది.




ఈ విధానంతో సత్ఫలితాలు లభిస్తున్నందున నగరంలోని అన్ని చెరువులు, కుంటల్లో విస్తృతంగా ఆయిల్ బాల్స్ ను వేయాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. కాగా గత 10 రోజులుగా నగరంలోని 1,08,449 ఇళ్లలో లార్వా, దోమల ఉత్పత్తిపై సర్వే నిర్వహించగా వీటిలో 23,918 ఇళ్లలో ఎక్కువగా క్యూలెక్స్, ఎనాఫిలిస్, ఎడిస్ దోమలకు బ్రీడింగ్ కేంద్రాలుగా ఉన్నాయని గుర్తించారు. ఈ 23,918 నివాసాల్లో పైరిత్రియం స్ప్రే చేయడంతో పాటు ఫాగింగ్ రోజుకు రెండు సార్లు ఎంటమాలజి విభాగం చేపట్టింది. ఈ విధంగా బహుళ వ్యూహాలతో విస్తృత కార్యక్రమాలు నగరంలో చేపడుతున్నందున గత వారం రోజులుగా డెంగ్యూ పాజిటీవ్ కేసులు తగ్గాయని జిహెచ్ఎంసి అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: