రాష్ట్ర ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాల్సిన వ్యక్తి, నైకతకు తిలోదకాలిచ్చి నయవంచన రాజకీయాలు చేస్తున్నాడని, రాజకీయరంగంలో ఉండేవారికి ఉండాల్సిన ఒక్క గొప్పగుణం కూడా ఆయనకు లేదని, అలాంటి వ్యక్తి రాష్ట్రానికి నాయకుడు కావడం   ప్రజల దురదృష్టమని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అభివర్ణించారు.  జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ప్రైవేటు బస్సుల జాతీయికరణ అంశంలో,  హైకోర్టు వాఖ్యానిస్తూ, ఒకమాట వాళ్లకు చెప్పి చేయాల్సింది అనడంతో, దాన్నే తప్పని భావించి, అప్పటికప్పుడే రాజీనామా చేసిన నీలంగారి స్థానంలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి తన నైతికత గురించి ఎందుకు ఆలోచించడం లేదని వర్ల ప్రశ్నించారు. 

11 సీబీఐ ఛార్జ్‌షీట్లలో, 5 ఈడీకేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, రూ.100ల కోట్ల ఆస్తులు జప్తుచేయబడిన వ్యక్తి, తనపై ఉన్న కేసులు, నేరాల గురించి రాష్ట్రప్రజలకు ఎందుకు చెప్పడంలేదని రామయ్య నిలదీశారు.   తనమీదున్న అభియోగాలు, సీబీఐ-ఈడీ కేసులు, తన ఆస్తుల జప్తు, వంటి వాటిపై తనకుతానుగా జగన్‌ ప్రజలకు వివరణ ఇచ్చిఉంటే, ఆయన నైతికత పెరిగేదన్నారు.  తమ ముఖ్యమంత్రి నిజాయితీపరుడై, సఛ్చీలుడై ఉండాలని ఓట్లేసిన ప్రజలు కోరుకోవడం లో తప్పులేదన్నారు. సీబీఐ, ఈడీ సంస్థలు రూ.43వేల కోట్ల మాయం సహా, అనేక ఇతర నేరాలకు సంబంధించి ప్రతిశుక్రవారం కోర్టుకు హాజరయ్యే వ్యక్తి రాష్ట్ర ప్రజలకు  ఎలాంటి మార్గదర్శి అవుతారని రామయ్య ఎద్దేవాచేశారు. 


జగన్‌లాంటి ముఖ్యమంత్రి, దేశంలో ఎక్కడా ఉండడన్న ఆయన, జగన్‌పై ఉన్న కేసులు మామూలువి కావన్నారు. చిదంబరం బెయిల్‌పిటిషన్లో ఢిల్లీహైకోర్టు కూడా జగన్‌ నేరాలను గురించి ప్రస్తావించిందన్న వర్ల, సుప్రీంకోర్టులో జరిగిన వాదనల్లో కూడా జగన్‌ ఆర్థికనేరాల అంశం చర్చకు వచ్చి ందని రామయ్య పేర్కొన్నారు. మనముఖ్యమంత్రి గురించి, ఆయన నేరచరిత్ర గురించి ఢిల్లీహైకోర్టు, సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తే, ఆయా వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా అని వర్ల ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్‌ సాగించిన నేరపరంపర, వ్యవస్థల దుర్వినియోగం, దేశ ఆర్థికరంగాన్నే ప్రభావితం చేసిందన్న న్యాయస్థానాల వ్యాఖ్యలపై జగన్‌ ఎందుకు నోరుమెదపడం లేదన్నారు? మీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నివసిస్తున్న పౌరుడిగా తన సందేహాలను, నివృత్తి చేయాల్సిన బాధ్యత, నైతికత జగన్మోహన్‌రెడ్డికి లేవా అని రామయ్య నిగ్గదీశారు. 


ఇంతటి నేరచరిత్ర , ఆర్థికనేరాల్లో ఇప్పటికీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి, ఈరాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉండటం అవసరమా అన్నారు. వైఎస్‌ అధికారంలో ఉండగా పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూర్చి, రాష్ట్రవనరులను ఇష్టానుసారం వారికిఅప్పగించి, వారిద్వారా తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించిన జగన్మోహన్‌రెడ్డి, క్విడ్‌ప్రోకో అనే సరికొత్త సంప్రదాయానికి ఆద్యుడిగా నిలిచారని వర్ల తెలిపారు.జగన్‌ ధనదాహం కారణంగా నాటి వైఎస్‌ కేబినెట్‌లోని మంత్రులు, ఐఏఎస్‌లు, పారిశ్రామికవేత్తలు జైళ్లపాలయ్యారని, వారందరికీ ఇప్పుడు లబ్ధి చేకూరుస్తూ, తననేరాల్లో భాగస్వాములైన వారికి న్యాయం చేస్తున్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా  ఎలా పనికొస్తాడన్నారు. నీతండ్రి చెప్పింది చేయడమే మేం చేసిన పాపమా... మేమెందుకు నీతో జైలుకురావాలి.. మాకెందుకీశిక్ష అంటూ కోర్టుప్రాంగణంలోనే జగన్‌ని కడిగిపారేసిన ఐఏఎస్‌ అధికారి రత్నప్రభ వ్యాఖ్యలపై జగన్‌ ఏం సమాధానం చెబుతారని వర్ల ప్రశ్నించారు. 


తనకున్న ప్రత్యేకత దృష్ట్యా, కోర్టుహాజరు నుంచి మినహాయింపు కోరుతూ, జగన్‌ సీబీఐకోర్టులో విజ్ఞప్తిచేస్తే, దానిపై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేస్తూ, ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితంచేసి, సాక్ష్యాలను తారుమారు చేసిన వ్యక్తి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇంకెంత ప్రభావితం చేస్తారో చెప్పాల్సిన పనిలేదనడాన్ని బట్టే జగన్‌ సమర్థత ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చన్నారు. స్వచ్ఛమైనమనస్సు, నేరరహిత హృదయంలేని వ్యక్తిగా జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ అభివర్ణించిందన్నారు. నేరగాళ్లకు మినహాయింపులు ఇవ్వడం సమాజానికి శ్రేయస్కరం కాదంటూ సీబీఐ తన అఫిడవిట్‌లో చెప్పినా, దానిపై జగన్‌ ఏమీపట్టనట్లుగా ఉన్నాడన్నారు. తనపై ఉన్న అభియోగాలు, నేరాలు, కోర్టులవ్యాఖ్యలకు సమాధానం చెప్పడానికి జగన్‌ ఎందుకు సంకోచిస్తున్నాడన్నారు. 


తన తండ్రి అధికారంలో లేనప్పుడు, రూ.2లక్షల ఆస్తిపన్ను కట్టిన జగన్మోహన్‌రెడ్డి, తండ్రి ముఖ్యమంత్రయ్యాక రూ.80కోట్ల అడ్వాన్స్‌ ట్యాక్స్‌లు ఎలా కట్టారని, లోటస్‌పాండ్‌, బెంగుళూరుప్యాలెస్‌లు, భారతీ, సాక్షి, విద్యుత్‌తయారీ కంపెనీలు ఎలా వచ్చాయని రామయ్య నిగ్గదీశారు. ఇంతటి ఘన నేరచరిత్ర కలిగిన వ్యక్తి, ఈ రాష్ట్రప్రజలకు ఎలా మార్గదర్శకులు అవుతారన్నారు. ప్రజల కష్టాన్ని కొట్టేసిన జగన్‌, తనకేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవారికి, తనతోపాటు జైలుకెళ్లిన వారికి ఇప్పుడు పదవులు కట్టబెడుతూ, వారికి న్యాయం చేస్తున్నారన్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: