టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి ప్రకాష్ ను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. రవి ప్రకాష్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అరెస్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రవిప్రకాష్ పై  చీటింగ్ కేసు నమోదు అయిందని అందువలనే అరెస్ట్ చేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. 
 
గత కొన్ని నెలల నుండి టీవీ9 రవి ప్రకాష్ ను ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. టీవీ9 ఛానల్ నిర్వహణకు సంబంధించిన కొన్ని పత్రాలు కనిపించకుండా పోవటంతో పాటు, ఫోర్జరీకి సంబంధించిన కేసులలో గతంలో రవి ప్రకాష్ పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. రవి ప్రకాష్ నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ చేపడుతున్నారు. 
 
రవిప్రకాష్ పై గతంలో అక్రమాలకు పాల్పడుతున్నారని టీవీ9 కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, షేర్ల విక్రయానికి సంబంధించిన కేసుల్లో రవి ప్రకాష్ పై కేసులు నమోదయ్యాయి. జులై 12వ తేదీన తెలంగాణ హైకోర్టు రవి ప్రకాష్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి ఒకరోజు పోలీసుల ముందు హాజరు కావాలని మరియు విచారణకు సహకరించాలని కోరింది. 
 
కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచిపెట్టి వెళ్లరాదని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఫోర్జరీతో పాటు మోసానికి పాల్పడ్డారని రవి ప్రకాష్ పై అలందా మీడియా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు గతంలో కేసు నమోదు చేసింది. ఈరోజు బంజారా హిల్స్ పోలీసులు రవి ప్రకాష్ ను టీవీ9 కేసులోనే అరెస్ట్ చేశారా లేక మరేదైనా ఇతర కారణాలున్నాయా అనే విషయాల గురించి మాత్రం కొంత సమయం తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: