సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి టీడీపీ కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. కావాలనే టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. దీనికి వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. అసలు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి ఆద్యుడు చంద్రబాబే అంటున్నారు వారు.


చంద్రబాబును ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించినా బుద్ధి రాలేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ అరాచక పాత్ర పోషిస్తుందని దుయ్యబట్టారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని చంద్రబాబు గంటల తరబడి మాట్లాడుతున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌ను ఎంతగా వేధించారు. లక్ష్మీపార్వతిపై మీరు చేసిన అరాచకాలు తెలియవా? జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూడా వదల్లేదు.. అంటూ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.


వైయస్‌ఆర్‌ కుటుంబంపై సోషల్‌ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారం చేశారో ప్రజలకు తెలియదా? రాష్ట్రానికి మద్దతుగా ఉండాల్సిన మీరు.. పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని అసత్యాలు చెబుతున్నారు. పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను జేబుల్లో పెట్టుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతాన్ని అల్లకొల్లొలం చేసేందుకు ప్రయత్నించారు.


టీడీపీ పాలనలో ఎంపీ మిథున్‌రెడ్డిపై అనవసరంగా కేసు నమోదు చేసి వేధించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు కళ్లు తెరిచి, వాస్తవాలు తెలుసుకోవాలని, ఏ అంశంపైనైనా కూడా చర్చకు మేం సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. మా ఎమ్మెల్యేలు విడదల రజినీ, టీజేఆర్‌ సుధాకర్‌బాబు మీకు సవాలు విసిరారని, దమ్ముంటే చర్చకు రావాలని సూచించారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని, లేదంటే ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా తిరస్కరిస్తారని హెచ్చరించారు.


వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేదల కోసం నాలుగు అడుగులు వేస్తున్నారని, వైయస్‌ఆర్‌ కంటి వెలుగు, అమ్మ ఒడి, రైతు భరోసా వంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని, వైయస్‌ జగన్‌ ఒక స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళ్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: