నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వెంకటాచలం ఎంపీడీవో సరళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన ఇంటిపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దౌర్జన్యానికి దిగారని ఆరోపణలు చేసిన ఎంపీడీవో.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కేసును స్వీకరించిన పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. 

 

 

 

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంపీడీఓ సరళ ఫిర్యాదు సంఘటనపై ప్రభుత్వానికి విపక్షాలనుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఆరా తీశారు. నిన్న రాత్రి ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే రాష్ట్ర డీజీపీ నుంచి సమాచారం రప్పించుకున్నారు. దీనిపై సీఎం.. 'చట్టానికి ఎవరూ అతీతులు కారు. తప్పు చేసినట్టు రుజువైతే కేసు నమోదు చేయండి. ఎంతటివారినైనా ఉపేక్షించొద్దు' అని ఆదేశించిన సంగతి తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే అరెస్టుతో ఆయన ఇంటివద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే అనుచరులు భారీగా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే అరెస్టుపై ఎంపీడీఓ స్పందిస్తూ.. తనకూ తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

 

 

అనికేపల్లిలో లేఔట్‌కు కొళాయి కనెక్షన్ విషయమై మూడ్రోజుల క్రితం తనను ఫోనులో బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న రాత్రి మద్యం సేవించి నా ఇంటిపైకి వచ్చారని, తన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఇంటి ముందు చెత్త డబ్బా పెట్టారని కూడా ఆరోపించారు. మొదట్లో పోలీసులు వివరాలు తీసుకున్నా కేసు నమోదు చేయలేదు. న్యాయం చేయాలంటూ అర్ధరాత్రి సమయంలో పీఎస్ ఆవరణలోనే బైఠాయించారు సరళ. నెల్లూరు గ్రామీణ పోలీసుస్టేషన్ ఎదుట సుమారు ఐదు గంటలపాటు బైఠాయించిన అనంతరం నిన్న తెల్లవారుజామున నాలుగు గంటలకు సరళ నుంచి ఎస్.ఐ ఫిర్యాదు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: