ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రాష్ట్రంలో నకిలీ, కల్తీ చేసిన పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు కనపడటానికి వీలు లేదని స్పష్టం చేశారు. కంపెనీల యజమానులు నాణ్యమైన సరుకు మాత్రమే అమ్ముతామని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని, అలా ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్న వారికి మాత్రమే లైసెన్సులు ఇస్తామని ఈ విధంగా కొత్త చట్టం తీసుకురాబోతున్నామని చెప్పారు. 
 
రాష్ట్రంలోని ఐటీసీ, ఉద్యానవన శాఖలు రాబోయే ఐదు సంవత్సరాల పాటు మిరప సాగులో ఖర్చులను తగ్గించి నాణ్యతను పెంచటం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం కొరకు ఒక ప్రణాళికతో మంత్రి కన్నబాబు సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి మరియు ఐటీసీ సీఈవో సంజయ్ రంగ రాజన్ ఈ విధంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ వాణిజ్య పంటలకు జాతీయ స్థాయిలో గుంటూరు రాజధానిగా ఉందని అన్నారు. 
 
నకిలీ, కల్తీ వ్యాపారాలకు కూడా గుంటూరు కేంద్రంగా ఉండటం శోచనీయమని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నకిలీ, కల్తీ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయటానికి స్పష్టమైన ప్రణాళిక వేసారని అన్నారు. మిరప పంటలో నాణ్యత మెరుగుపడాలని నాణ్యత పెరిగితే ఎగుమతులు పెరుగుతాయని, ఎగుమతులు మెరుగుపడటం ద్వారా రైతుల ఆదాయం కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని మంత్రి కన్నబాబు అన్నారు. 
 
వ్యవసాయ రంగానికి మరియు రైతులకు సేవలు అందించటం కొరకు సామాజిక సేవా దృక్పథంతో ఐటీసీ వంటి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కన్నబాబు పిలుపునిచ్చారు. కన్నబాబు ఐటీసీ కార్యాలయంలో మిర్చి రైతులకు ఉచిత సేవలను అందించే కాల్ సెంటర్ ను ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఆయిల్ పామ్ ఉత్పత్తిలో నూనె నిర్థారణ శాతంలో వచ్చిన వ్యత్యాసం కింద రైతులకు 85 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఆయిల్ పామ్ రైతులకు మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: