తాటిచెట్టు కింద మంచినీళ్లు తాగాను అన్నట్లు ఉంది వైకాపా ప్రభుత్వంలోని మంత్రుల పనితీరు. చేతకాని ప్రభుత్వంలో పనిచేస్తూ.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రోజుకో కొత్త డ్రామాకు తెరదీస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యన్నారాయణ రాజు పేర్కొన్నారు. బోటు ప్రమాద ఘటనలో 50 మందికి పైగా జలసమాధి అయి 22 రోజులు గడిచినా.. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. నేటికీ బోటు వెలికితీతలో నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. పైగా ప్రమాదం జరిగిన కచ్చలూరు పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించి.. మీ చేతకానితనాన్ని మరోసారి నిరూపించుకున్నారు. దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో ప్రజా నమ్మకాన్ని కోల్పోయిన ప్రభుత్వంగా వైకాపా చరిత్రకెక్కితే.. చేతగాని మంత్రిగా అవంతి శ్రీనివాసరావు రికార్డుకెక్కారు.

 

 ఆటోలపై జగన్మోహన్‌ రెడ్డి ఫొటోలు ఉంటే.. ఆర్టీఏ అధికారులెవరూ ఇబ్బందిపెట్టరని చెప్పడం ద్వారా మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు. ఆటోల మీద జగన్‌ ఫోటోలు పెట్టుకోటానికి, ఆర్టీఏ అధికారులు ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి మధ్య గల లింక్‌ ఏమిటి..? మంత్రివర్యులు సమాధానం చెప్పాలి. వాహనదారులకు అన్ని పత్రాలు లేకున్నా, ఎలా పడితే అలా డ్రైవ్‌ చేసినా వైకాపా ప్రభుత్వం వారిని కాపాడుతుందనా మీ ఉద్దేశం..? రేపు మరో బోటు ప్రమాదం జరిగి అందులో జగన్మోహన్‌ రెడ్డి ఫోటో ఉంటే కూడా చర్యలు తీసుకోరా..? జగన్‌ ఫోటో పెట్టుకుంటే చాలు ఉగ్రవాదులను కూడా వదిలేస్తామన్న విధంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ వ్యవహరిస్తున్నారు. 


చంద్రబాబును విమర్శించి, జగన్మోహన్‌ రెడ్డి వద్ద మార్కులు పొందాలన్న తాపత్రయంతో అవంతి శ్రీనివాస్‌ జనంలో నవ్వులపాలవుతున్నారు. ఆయనదంతా విగ్రహం పుష్టి-నైవేద్యం నష్టి అనే విషయం.. పార్టీలో, జిల్లాలో అందరికీ అర్ధం అయ్యింది. ఇప్పటికైనా అవంతి శ్రీనివాస్‌ వ్యర్ధ ప్రేలాపనలు మానుకుంటే మంచిది. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. అతనని మంత్రి పదవి నుంచి తొలగించాలి. బోటు ప్రమాదం నిజానిజాలు నిగ్గు తేల్చేలా న్యాయ విచారణ జరిపించాలని మంతెన డిమాండ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: