తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.  నిన్నటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.  నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు సమ్మెను వదిలి విధుల్లోకి రావాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది.  అయితే, సమ్మె చేసేందుకే కార్మికులు మొగ్గు చూపారు.  ప్రభుత్వం మరికొంత గడువు ఇచ్చి ఈరోజు ఉదయం వరకు సమ్మె వదిలి విధుల్లోకి రావాలని కోరింది.  


తమ సమస్యలు పరిష్కరించే వరకు విధుల్లోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పింది.  దీంతో ఈ మధ్యాహ్నం నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతస్థాయి అధికారులతో చర్చలు జరిపారు.  ఈ చర్చల్లో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  నిన్న సాయంత్రం వరకు విధుల్లోకి హాజరైన వారిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణింపబడతారని, విధులకు హాజరుగని వారిని విధుల నుంచి బహిష్కరిస్తున్నట్టు కెసిఆర్ పేర్కొన్నారు.  


ఆర్టీసీ.. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో బస్సులను నడిపే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.  నిన్న సాయంత్రం వరకు తెలంగాణలోని 78 ఆర్టీసీ డిపోల్లో కేవలం 1200 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు.  వీరిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణింప బడతారని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.  కొత్తగా ఆర్టీసీలోకి తీసుకునే ఉద్యోగుల చేత యూనియన్లలో చేరబోమని హామీ సంతకం తీసుకున్నాకే ఉద్యోగంలో తీసుకోవాలని సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  


ఆర్టీసీని ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని కెసిఆర్ మరోసారి స్పష్టం చేశారు.  మరి ఇప్పటి వరకు సమ్మె చేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటి.. సమ్మె చేస్తే సమస్యలు పరిష్కరిస్తారు అనుకుంటే.. ఏకంగా ఉద్యోగాల్లో నుంచి తొలగించినట్టుగా ప్రకటించడంతో ఆర్టీసీ కార్మికులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.  రాష్ట్రంలో ఆర్టీసీ మనుగడ ఏంటి.. బస్సులు రేపటి నుంచి నడుస్తాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.  వేలాదిమందికి ఒకేసారి విధుల నుంచి తొలగిస్తే... అంతా చూస్తూ ఊరుకుంటారా.. ఉద్యమం మరింత ఉదృతం కాకుండా ఉంటుందా.. అసలేం జరగబోతుంది అన్నది తెలియాలి.  ఇప్పటి వరకు కార్మికులు శాంతియుత వాతావరణంలోనే సమ్మె నిర్వహించారు.  ప్రభుత్వ నిర్ణయంతో ఇది ఎటువైపుకు దారితీస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: