ప్రస్తుత కాలంలో రోజురోజుకు డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిపోతుంది. బ్యాంకులు కస్టమర్లకు అర్హతలను బట్టి క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. ఈ కామర్స్ కంపెనీలు క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించి చెల్లించే వారికి క్యాష్ బాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా పెరగటంతో క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. 
 
కొన్ని సందర్భాలలో క్రెడిట్, డెబిట్ కార్డులు పోగొట్టుకోవటం లేదా ఎవరైనా దొంగలించటం జరుగుతుంది. అలాంటి సందర్భాలలో కార్డును ఎవరైనా దుర్వినియోగం చేస్తే ఎలా అనే భయం కూడా వెంటాడుతుంది. అలాంటి సందర్భాల్లో కంగారు పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కార్డును ఎవరూ దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త పడవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డులు పోయినట్లు గుర్తిస్తే వీలైతే బ్యాంకు శాఖకు వెళ్లి ఫిర్యాదు చేసి కార్డు బ్లాక్ చేయించవచ్చు. 
 
సంబంధిత బ్యాంక్ కాల్ సెంటర్ నంబర్ కు ఫోన్ చేసి సరైన వివరాలు చెప్పి కూడా కార్డ్ బ్లాక్ చేయించవచ్చు. కాల్ సెంటర్ నంబర్ తెలియని వారు సంబంధిత బ్యాంకు వెబ్ సైట్ లో పొందవచ్చు. గూగుల్ లో సెర్చ్ చేసినా కాల్ సెంటర్ నంబర్ దొరుకుతుంది కానీ కొందరు సైబర్ నేరస్థులు గూగుల్ లో వారి మొబైల్ నంబర్లను ఉంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కాబట్టి బ్యాంకు వెబ్ సైట్ లో వెతకటమే మంచిది. 
 
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కార్డ్ బ్లాక్ చేయవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డుల పిన్ నంబర్లను ఏటీఎంల మీద రాయకుండా గుర్తు పెట్టుకోవటమే మంచిది. మీరు బ్లాక్ చేయించేలేపే ఆ కార్డ్ నుండి ఏదైనా లావాదేవీ జరిగినట్లు తెలిస్తే సంబంధిత బ్యాంకు శాఖ అధికారులకు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. కార్డు నంబర్లను స్నేహితులు, బంధువులకు చెప్పాల్సి వస్తే మెసేజ్ చేయకుండా ఫోన్ ద్వారా చెప్పటం ఉత్తమం. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: