ప్రస్తుతం ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో ఉంది. ఇవి ఒక్కసారిగా వచ్చినవి కావు.

టికెట్ల అమ్మకాల ద్వారా ఆర్టీసీకి రోజుకు 11 కోట్ల రూపాయల వరకు వస్తుంది. 2018-19 ఏడాదికి ఇది రూ.3,976 కోట్లు. ఇది ఏటా మారుతుంది. ఇతర మార్గాల నుంచి అంటే షాపుల అద్దెలు, ప్రకటనలు, పార్శిళ్లు లాంటి వాటి నుంచి సుమారు రూ.వెయ్యి కోట్లు వస్తుంది. అన్నీ కలిపి 2018-19లో ఆర్టీసీ స్థూల ఆదాయం రూ.4,882 కోట్లు.ఖర్చు సంగతికి వస్తే ఆదాయం కంటే ఏటా వెయ్యి కోట్ల రూపాయల వరకు అదనపు వ్యయం ఉంటుంది. ఆర్టీసీ ఖర్చులో ఎక్కువ భాగం జీతాలు, డీజిల్, పన్నులకే పోతుంది. ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం వల్ల ఆర్టీసీ ఏటా నష్టాల బారిన పడుతోంది. 2018-19లో ఆర్టీసీ స్థూల నష్టం రూ.928 కోట్లు.ఈ గణాంకాలకు ఆధారం- పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి బీబీసీకి ఇచ్చిన పత్రాలు.

ప్రైవేటు సంస్థలయితే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే టికెట్ రేట్లు పెంచడం ద్వారా ఆదాయం పెంచుకుంటాయి. లేదా నష్టాలు వచ్చే మార్గాలు రద్దుచేస్తారు.


ఆర్టీసీ అలా ఎందుకు చేయలేదంటే..

1. ప్రైవేటు సంస్థల్లా ఆర్టీసీ ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచడానికి ఉండదు. ప్రభుత్వ అనుమతితోనే రేట్లు పెంచాలి.

2. పలు వర్గాలకు ఆర్టీసీ ఉచితంగా, లేదా రాయితీలతో కూడిన ప్రయాణం అందిస్తుంది. ఉదాహరణకు లక్షల మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా లేదా నామమాత్రపు చార్జీలతో ప్రయాణిస్తారు. వీరికే కాకుండా వివిధ వర్గాల వారికి బస్సు ప్రయాణాల్లో రాయితీ వస్తుంది.

3. చాలా ఊళ్లకు బస్సు నడిపేప్పుడు బస్సులో తగినంత మంది ప్రయాణికులు ఉండరు. బస్సు వెళ్లే దూరం, ప్రయాణికుల సంఖ్య, ఆదాయాన్ని బట్టి చూస్తే దీనిని తిప్పడం వల్ల చాలా నష్టం వస్తుంది. కానీ ఆయా గ్రామాలకు రవాణా సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో లాభనష్టాలతో నిమిత్తం లేకుండా బస్సులు తిప్పుతుంది ఆర్టీసీ. పల్లె బస్సులకే కాదు, సిటీ బస్సులకూ నష్టాలు విపరీతంగా ఉంటాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: