పుణె నగరంలో తుషార్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఉండేవాడు. మూడు రోజుల క్రితం వందన షా అనే మహిళ జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసింది. వందన షా ఆర్డర్ చేసిన ఆహారాన్ని కొంత సమయం తరువాత తుషార్ డెలివరీ చేశాడు. ఆ సమయంలో వందన షా పెంచుకునే కుక్క ఇంటి పరిసరాలలో ఆడుకుంటూ ఉండేది. వందన షా ఆ కుక్కను దొత్తు అనే పేరుతో పిలిచేది. 
 
ఆర్డర్ చేసిన ఫుడ్ తిన్న తరువాత వందన షా కుక్క పిల్ల కోసం వెతకసాగింది. కానీ ఎంత వెతికినా కుక్క పిల్ల కనిపించలేదు. అన్నిచోట్ల వెతికిన వందన షా కుక్క పిల్ల ఎక్కడికి వెళ్లిందో అర్థం కాక సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించింది. రికార్డ్ అయిన వీడియోలో కుక్క పిల్ల ఇంటి పరిసరాలలో ఆడుకుంటున్న దృశ్యం కనిపించింది. వందన షా ఇరుగుపొరుగు వాళ్లను కుక్క పిల్ల గురించి అడగగా జొమాటో డెలివరీ బాయ్ ఆ కుక్క పిల్లను తీసుకెళ్లటం చూశామని వారు చెప్పారు. 
 
ఏం చేయాలో అర్థం కాని వందన షా జొమాటో కస్టమర్ కేర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. కస్టమర్ కేర్ ప్రతినిధులు వందన షాకు తుషార్ ఫోన్ నెంబర్ ఇవ్వగా వందన షా తుషార్ కు కాల్ చేసి తన కుక్క పిల్ల గురించి అడిగింది. తుషార్ తాను కుక్క పిల్లను ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. కానీ కుక్క పిల్ల ప్రస్తుతం తన దగ్గర లేదని తన సొంత గ్రామానికి ఆ కుక్క పిల్లను పంపించానని తుషార్ చెప్పాడు. 
 
వందన షా కుక్క పిల్ల గురించి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి జొమాటో డెలివరీ బాయ్ వివరాలు జతచేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయటానికి నిరాకరించారని తెలుస్తోంది.. జొమాటో ప్రతినిధులు కూడా ఈ ఘటన గురించి స్పందించి కుక్క పిల్లను వందన షా ఇంటికి చేర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం తుషార్ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: