ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మెకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతునిచ్చే అవకాశముందని తెలిసే ముఖ్యమంత్రి కేసీఆర్ , ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించుకుని మాట్లాడి, వారిని మచ్చిగా చేసుకునే ప్రయత్నం చేశారన్నది నిర్వివాదాంశమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . గతంలో ఆర్టీసీ కార్మికులతో కలిసి , ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు  పనిచేశాయి .  రాష్ట్రం లో గత ఏడు రోజులుగా ఆర్టీసీ కార్మికులు  చేస్తోన్న సమ్మెకు మద్దతుగా ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల ను కూడా ప్రభుత్వం ముందు పెడుతూ , ఒక దశలో  పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు .


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా పీఆర్సీ అంశాన్ని ఇప్పటికే పలుమార్లు లేవనెత్తారు . అయినా  గత ఏడాది కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు సరికదా ... ఎన్నిమార్లు ఉద్యోగ సంఘాల నేతలు అపాయింట్ మెంట్ కోరిన ఇవ్వకుండా తిరస్కరిస్తూ వచ్చారు . అయితే గురువారం ఉన్నట్టుండి ఉద్యోగ సంఘాల నేతల , తన కేబినెట్ సహచరుడు  శ్రీనివాస్ గౌడ్ ద్వారా కబురు పెట్టి  ప్రగతిభవన్ కు  పిలిపించుకుని చర్చలు జరిపి , కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించడం వెనుక కేసీఆర్ ఎత్తుగడ ఏమిటో కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోగలరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .


ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ అవలంభిస్తున్న కఠిన వైఖరిని తెలంగాణ సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తోందని , ఈ సమయం లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్ డౌన్ చేస్తే మరింత అభాసుపాలు కావడమే కాకుండా , సకలజనుల సమ్మె నాటి పరిస్థితులు తలెత్తుతాయని భావించిన కేసీఆర్ ఉద్యోగులను మచ్చిగా చేసుకునే ఎత్తుగడ వేశారంటున్నారు . అదే సమయం లో బ్రిటిషు వాడి విభజించు - పాలించు నీతిని అమలు చేస్తూ,  ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మెను విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని  విశ్లేషిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: