రాష్ట్రంలో పదేళ్లు కష్టపడి  వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చారని,  అలాంటి వ్యక్తిని చంద్రబాబు రౌడీ ముఖ్యమంత్రి, నేరస్తుడు అని అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అన్నారు. నాలుగు నెలల పాటు చంద్రబాబుకు పదవి లేకపోయే సరికి, తన పార్టీని వదిలి నాయకులు వదలిపెడుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. క్షణం తీరిక లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అంబ‌టి ఈ రోజు ప్రెస్‌మీట్లో ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్నారు. చంద్రబాబు చాలా చోట్లకు వెళ్లి నన్ను ఓడించి తప్పు చేశారని అంటున్నారు. తాను పాలించే ఆవునని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎందుకు ఓడిపోయారో ఆత్మవిమర్శ చేసుకోకపోతే టీడీపీకి అసలు మనుగడే ఉండదన్నారు.


ఏపీలో ప్రజలు టీడీపీని ఘోరంగా ఓడించి, కేవలం 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అనుభవం ఉన్న చంద్రబాబును ప్రజలు మూలన కూర్చోబెట్టారు. తాను తప్పు చేశానన్న వాస్తవాన్ని గమనించలేక, ప్రజలు తప్పు చేశారని వింత ధోరణితో చంద్రబాబు మాట్లాడుతున్నారని రాంబాబు ఎద్దేవా చేశారు. పులివెందుల పంచాయితీ కాదు.. పౌరుషానికి నిదర్శనమైన ప్రాంతమది. ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన ప్రాంతమది. పులివెందుల పంచాయితీ అంటే ఊరుకోకండి. అట్ల కర్ర కాల్చి చంద్రబాబు మూతిపై వాత పెట్టాలని కోరుతున్నా అని రాంబాబు కోరారు.


చింతమనేని ప్రభాకర్‌ పంచాయితీ చేసింది చంద్రబాబు కాదా అని,  ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం విషయంలో పంచాయితీ చేసింది నీవు కాదా చంద్రబాబు అంటూ రాంబాబు దుయ్య‌బ‌ట్టారు. చింతమనేని, వనజాక్షి వ్యవహారంలో చంద్రబాబు  ఎలా వ్యవహరించారో,  కోటంరెడ్డి, సరళమ్మ వ్యవహారంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎలా వ్యవహరించారో చంద్రబాబు తెలుసుకోవాలని  అంబటి రాంబాబు హితువు ప‌లికారు. కరకట్ట పంచాయితీ అంటున్నాడ‌ని,  ఆ ఇల్లు నీదా చంద్రబాబు ? అంటూ ప్ర‌శ్నించారు.  వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తరువాత ఆ ఇల్లు నాది అంటున్నావు,  నీవు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం లింగమనేని గెస్ట్‌ హౌస్‌ అన్నావని గుర్తు చేశారు.  


కుప్పం కుట్రలు చంద్రబాబువి, చంద్రబాబు ఇంకా ఫ్రస్టేషన్‌లో ఉన్నార‌ని అన్నారు.  చంద్రబాబు ఎక్కడికెళ్తే అక్కడ పులివెందుల పంచాయితీ అంటున్నారు. వైఎస్‌ జగన్‌, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పుడైనా పంచాయితీలు చేశారా? పంచాయితీలు చేసే లక్షణం చంద్రబాబుకే ఉంది. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలతో ఐఏఎస్‌ ఆఫీసర్‌ను కూర్చోబెట్టి ఫిప్టీ ఫిప్టీ అని పంచిపెట్టింది ఎవరూ? విశాఖ ల్యాండ్‌ స్కామ్‌లో అయ్యన్నపాత్రుడు, గంటాల మధ్య పంచాయితీ చేసింది నీవు కాదా ?  అంటూ ప్ర‌శ్నించారు.


బుద్ధి, జ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. వైఎస్‌ జగన్‌పై నేరారోపణలు చేయబడ్డాయి. అవి విచారణలో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని నేరస్తుడు అని చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నారు ? చంద్రబాబు గతంలో ప్రతిపక్షంలో ఉండి గట్టిగా అరిస్తే..మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి భయపడేవారట.. నేనైతే ఎప్పుడు అలాంటి పరిస్థితి చూడలేదు. అసెంబ్లీలో ఎవరు ఎవర్ని చూసి భయపడేవారో ప్రజలందరికీ తెలుసని అంబ‌టి ధ్వ‌జ‌మెత్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: