జపాన్‌లోని ఓ స్కూల్‌ తరగతి గది అది. స్కూలు వదిలేసే సమయం.. విద్యార్థులంతా బ్యాగ్లులో  పుస్తకాలు సర్దుకుని ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా పాఠాలు విన్న తర్వాత  ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అని వారంతా ఎదురు చూస్తుంటారు. మరుసటి రోజు చేయాల్సిన పనికి సంబంధించి టీచర్ ముఖ్యమైన విషయం చెబుతుండడంతో వారంతా శ్రద్ధగా విన్నారు.


ఆ విషయం చెప్పడం పూర్తయ్యాక టీచర్, ''సరే... ఈ రోజు మొదటి రెండు వరుసల్లో ఉన్నవారు క్లాస్ రూం శుభ్రం చేయాలి. మూడు, నాలుగు వరుసల విద్యార్థులు కారిడార్, మెట్లు శుభ్రం చేయాలి. అయిదు, ఆరు వరుసలవారు టాయిలెట్లు శుభ్రం చేస్తారు' అని తెలిపారు. అంతా క్షణాల్లో సైనికుల్లా చురుగ్గా కదులుతూ ఎవరికి చెప్పిన  పనులను వారు చకచకా పూర్తి చేశారు. ఆ స్కూలే కాదు ఆ దేశంలోని అన్ని స్కూళ్లలోనూ ఇదే పద్ధతి ఉంటుంది.


జపాన్‌ను తొలిసారి సందర్శించేవారు ఈ దేశం ఇంత శుభ్రంగా ఉందేమిటి అని నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోతారు. రోడ్ల పక్కన చెత్తకుండీలు కానీ, రోడ్లూ ఊడ్చేవారు కానీ లేని విషయం కూడా గమనిస్తారు. 'ఇవేమీ లేకుండానే ఇంత శుభ్రంగా ఉందేమిటి?'' అనుకుంటారు. కొద్దిసేపటికి వారికి సమాధానం దొరుకుతుంది. ప్రజలే ఎవరికి వారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటున్నారని అర్థం అవుతుంది.


హిరోషిమాలోని ప్రెఫెక్చురల్ గవర్నమెంట్ టోక్యో కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ మైకో అవానీ తమ దేశం ఎందుకు ఇంత  శుభ్రంగా ఉంటుందో చెబుతూ ''ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు పన్నెండేళ్ల స్కూలు జీవితంలో ప్రతిరోజూ పారిశుద్ధ్యానికి సమయం కేటాయిస్తార''ని అన్నారు. ''వస్తువులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని ఇంట్లో కూడా నిత్యం ఎప్పుడు చెబుతుంటారు. అందుకే చిన్నతనం నుంచి ఆ లక్షణం అలవడుతుంది'' అని తెలిపారు. స్కూళ్ల  కూడా పాఠ్యపుస్తకాలలోనే సామాజిక స్పృహను అలవాటు చేసే విదంగా అధ్యాయాలుంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: