ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీనుండి రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు భరోసా పథకంలోని లబ్ధిదారుల జాబితాలో మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు ఉండటం ఈరోజు ఉదయం నుండి వైరల్ అవుతోంది. ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులు కాకపోయినప్పటికీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉండటం వివాదానికి కారణమైంది. 
 
మంత్రి ఆదిమూలపు సురేష్ కు ప్రకాశం జిల్లాలోని గణపవరం అనే గ్రామంలో 94 సెంట్లు ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 19 ఎకరాల పొలం ఉంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ వివాదంపై స్పందించారు. ఈ విషయం గురించి వ్యవసాయ అధికారులను వివరణ కోరానని మంత్రి చెప్పారు. ఈ రోజు ఉదయం వైయస్సార్ రైతు భరోసా జాబితాలో తన పేరు ఉన్న విషయం తెలిసిందని మంత్రి చెప్పారు. 
 
రైతు భరోసా సాఫ్ట్ వేర్ లో ప్రజాప్రతినిధులు అనే ఆప్షన్ చేర్చకపోవటం వలన తన పేరు రైతు భరోసా పథకం జాబితాలో ఉందని చెప్పారు. ఈ పథకానికి ఎవరైతే అర్హులో వారికే సంక్షేమ ఫలాలు అందాలని మంత్రి అన్నారు. ఈ తప్పిదం గురించి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తెచ్చానని ఎక్కడైనా తప్పిదాలు జరిగి ఉంటే సరిచేయమని చెప్పానని అన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను పూర్తి స్థాయి పరిశీలన తరువాత రైతు భరోసా జాబితా విడుదల చేయాలని కోరారు. 
 
వైసీపీ ప్రభుత్వం వైయస్సార్ రైతు భరోసా పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఈ పథకం అమలులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని మంత్రి కోరారు. అక్టోబర్ 15వ తేదీ నుండి రాష్టంలో వైయస్సార్ రైతు భరోసా పథకం అమలు కాబోతుంది. అర్హులైన రైతుల ఖాతాలలో ప్రభుత్వం నగదు జమ చేయనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: